తెలంగాణాలో విచిత్ర వాతావరణం.. ఆ జిల్లాల్లో వానలు, ఈ జిల్లాల్లో ఎండలు!
తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఎండాకాలం ఎండలు మండిపోతాయి అని వాతావరణ శాఖ అధికారులు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ సంవత్సరం ఎండాకాలంలో ప్రస్తుతం విచిత్ర వాతావరణ నెలకొంది. ఒకపక్క తీవ్రమైన ఎండలు మరొక పక్క అకాల వర్షాలతో తెలంగాణ ప్రజానీకం ఉక్కిరి బిక్కిరి అవుతుంది. చాలా జిల్లాలలో భానుడి ఉగ్రరూపం కనిపిస్తుంది.
ఒకపక్క ఎండలు, మరోపక్క వానలు
భరించలేని ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. వడగాలుల దెబ్బకు ప్రజలు అల్లాడుతున్నారు. పలువురు వృద్ధులు వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో అకస్మాత్తుగా కురుస్తున్న అకాలవర్షాలు కూడా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. మామిడి తోటలు కాపుకు వచ్చి పంట చేతికి వచ్చే సమయంలో వడగండ్ల వానలు కురుస్తూ ఉద్యాన పంటల సాగు చేస్తున్న రైతన్నలకు తీవ్ర దుఃఖాన్ని మిగులుస్తున్నాయి.

ఈ జిల్లాలలో వర్షాలు
ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాలలో ఈరోజు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు.ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, సిద్దిపేట, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఈ జిల్లాలలో వడగాలులు... జాగ్రత్త
ఈ జిల్లాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఉత్తర తెలంగాణ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
రాష్ట్రంలో అనేకచోట్ల వర్షాలు
ఈ జిల్లాలలో ప్రజలు ఎండ సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదని సూచించారు. ఇక ఇప్పటికే ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వర్షాల వల్ల పంట నష్టం జరుగుతుందని రైతులలో ఆందోళన కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications