కవితపై మరో బాంబు పేల్చిన సుఖేష్: ఫోన్ నంబర్లతో సహా
హైదరాబాద్: మనీ లాండరింగ్ కేసులో దేశ రాజధానిలోని తిహార్ కేంద్ర కారాగారంలో విచారణను ఎదుర్కొంటోన్న సుఖేష్ చంద్రశేఖర్.. తాజాగా మరో లేఖను విడుదల చేశారు. భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితతో ఛాట్ చేసినట్లు వాట్సప్ స్క్రీన్ షాట్లను విడుదల చేసిన ఆయన.. తాజాగా మళ్లీ తెరమీదికి వచ్చారు.
గతంలో తాను ఛాటింగ్ చేసింది కవితతోనేని తేల్చి చెప్పారు. దీనిపై ఆయన అయిదు పేజీల లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను పొందుపరిచారు సుఖేష్ చంద్రశేఖర్. కవిత ఫోన్ నంబర్లు ఉన్న స్క్రీన్ షాట్లను కూడా బయటపెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కవితతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను తీహార్ క్లబ్‌కు స్వాగతం పలుకుతున్నానంటూ పేర్కొన్నారు.

సీబీఐ అధికారులు ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లను జారీ చేసిన మరుసటి రోజే సుఖేష్ చంద్రశేఖర్ ఈ లేఖను విడుదల చేశారు. కేజ్రీవాల్ తరువాత సీబీఐ సమన్లను కవిత అందుకోబోతోన్నారంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కవితతో చేసిన వాట్సప్ ఛాటింగ్ స్క్రీన్ షాట్లను విడుదల చేశానని, త్వరలో కేజ్రీవాల్‌తో ఛాట్స్ కూడా బయటపెడతానని పేర్కొన్నారు.
తనను అర్ధిక నేరగాడిగా అభివర్ణించడాన్ని సుఖేష్ చంద్రశేఖర్ తప్పుపట్టారు. ఆ ఆర్థిక నేరాల్లో కేజ్రీవాల్, కవితకు భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. ధైర్యం ఉంటే విచారణ సక్రమంగా జరిగేలా సహకరించాలంటూ కవితకు సవాల్ విసిరారు. కవితను తాను సొంత అక్కగా భావించానని, ఆమెను కవితక్కగా పిలుస్తుంటానని పేర్కొన్నారు. ఇప్పుడు నిజాలను మాట్లాడాలనుకుంటున్నానని పేర్కొన్నారు.
తనకు సుఖేష్ చంద్రశేఖర్ ఎవరో తెలియదంటూ కవిత చెప్పడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఇస్తోన్నానంటూ ఈ అయిదు పేజీల లేఖను విడుదల చేశారు. ఇదివరకు విడుదల చేసిన స్క్రీన్ షాట్స్ కవితవేనంటూ నిర్ధారిస్తూ ఆమె ఫోన్ నంబర్లతో కూడిన వివరాలను వెల్లడించారు కవితతో 6209999999, 8985699999 నంబర్లతో ఛాట్ చేశానని వివరించారు.
ఇంకో ఛాట్‌లో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ వ్యక్తిగత ఫోన్ నెంబర్ 9810154102 అని లేఖలో పేర్కొన్నారు. మొత్తం 703 ఛాటింగ్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయని, రెండింటిని మాత్రమే తన తరఫు న్యాయవాది అనంత మాలిక్ విడుదల చేశారని వివరించారు. ఇంకా అనేక వీడియో ఛాట్లు, ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయన్న సుఖేష్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

తెలుగు భాష సుఖేష్ చంద్రశేఖర్‌కు ఎలా తెలుసంటూ బీఆర్ఎస్ నాయకులు వేసిన ప్రశ్నలకు కూడా ఆయన సమాధానాలను ఇచ్చారు. తన తండ్రి తెలుగు వారని, తల్లి తమిళనాడు చెందినవారని ఈ రెండూ తన మాతృభాషలేనని వ్యాఖ్యానించారు. రాజకీయంగా తనను ప్రభావితం చేస్తోన్నారని విమర్శల్లో అర్థం లేదని చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్నానని వివరించారు.












Click it and Unblock the Notifications