ఎమ్మెల్యేల ఎర కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు: నిందితులకు నో రిలీఫ్
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసులో సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. సింగిల్ జడ్జి పర్యవేక్షణ, సిట్ విచారణ నిలిపివేయాలంటూ ఈ కేసు నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలంటూ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం పక్కన పెట్టింది. అంతేగాక, సిట్ విచారణను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది.

సిట్ విచారణ స్వేచ్ఛగా జరిగేలా అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. సిట్‌పై ఉన్న ఆంక్షలు, నియమ నిబంధనలను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. సింగిల్ జడ్జి వద్ద పెండింగ్ లో ఉన్న పిటిషన్లను నాలుగు వారాల్లో పరిష్కరించాలని జస్టిస్ గవాయ్, జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం ఆదేశించింది.
మరోవైపు, ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ తోపాటు కరీంనగర్ లాయర్ శ్రీనివాస్, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామికి నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం విచారణకు రావాలని ఆదేశించింది. విచారణకు హాజరుకాకుంటే అరెస్ట్ చేస్తామంటూ హెచ్చరించింది.












Click it and Unblock the Notifications