సుప్రీంకోర్టులోనూ ఎమ్మెల్సీ కవితకు షాక్.. చట్టం ముందు అందరూ ఒకటే!!
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారని, నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ కు పాల్పడ్డారని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. లిక్కర్ కేసులో అరెస్టయి ఊరట కోసం ప్రయత్నిస్తున్న ఆమెకు చుక్కెదురైంది. కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం, ఈ కేసులో ప్రస్తుతం విచారణ చేయలేమని వెల్లడించింది.
రాజకీయ నాయకులైనంత మాత్రాన ప్రత్యేక విచారణ ఉండబోదని, తప్పనిసరిగా కేసును ఎదుర్కోవలసిందేనని స్పష్టం చేసింది. జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సుంద్రేష్, జస్టిస్ బేల త్రివేది తో కూడిన ధర్మాసనం ఈ కేసు విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కవిత వేసిన రిట్ పిటిషన్ లో లేవనెత్తిన అంశాలను విజయ్ మదన్ లాల్ కేసుతో కలిపి విచారణ చేస్తామని పేర్కొంది.

చట్టం అందరికీ ఒకటేనని, రాజకీయ నాయకులైనంత మాత్రాన ప్రత్యేక విచారణ ఇక్కడ జరపలేదని, ట్రయల్ ఎదుర్కోవలసిందేనని పేర్కొంది. ఇదే సమయంలో కవిత వేసిన రిట్ పిటిషన్ కు సంబంధించి ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ అధికారులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇక ఈ కేసులో బెయిల్ కావాలంటే ట్రయల్ కోర్టులోనే పిటిషన్ దాఖలు చేయాలని కవిత తరపు న్యాయవాదికి సుప్రీం ధర్మాసనం సూచించింది. మహిళ అనే దృష్టితో ట్రయల్ కోర్టు కూడా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది.
కాగా ఈరోజు ఆరో రోజు ఈడి అధికారుల విచారణను ఎమ్మెల్సీ కవిత ఎదుర్కొంటున్నారు. మరోవైపు సీఎం కేజ్రీవాల్ ను కూడా అరెస్టు చేయడంతో కేసు ఊహించని విధంగా కీలక మలుపులు తిరుగుతోంది. ఏది ఏమైనా నేడు సుప్రీం ధర్మాసనంలో కవితకు ఊరట దొరకని క్రమంలో, ఆమె మరోమారు సుప్రీం ఆదేశాలతో ట్రయల్ కోర్టును ఆశ్రయిస్తారా? ఒకవేళ ఆశ్రయించినా ఆమెకు ఈ కేసు నుంచి ఉపశమనం దొరుకుతుందా? అన్నది ప్రశ్నార్థకమే.












Click it and Unblock the Notifications