కేసీఆర్‌కు షాక్: 'రెండు వారాలు పోలీస్ టవర్ల నిర్మాణం నిలిపేయండి'
హైదరాబాద్: కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ట్విన్ టవర్ల నిర్మాణానికి సుప్రీం కోర్టు బ్రేకులు వేసింది. పోలీసు శాఖ కోసం చేపట్టిన ట్విన్ టవర్ల నిర్మాణానికి సంబంధించి రెండు వారాల పాటు ఎలాంటి పనులూ చేపట్టొద్దని జస్టిస్ జగదీశ్‌సింగ్ కేహర్, జస్టిస్ సి.నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వివాదాస్పద స్థలానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న క్రమబద్దీకరణ దరఖాస్తును పరిష్కరించిన తర్వాతే పనులు చేపట్టాలని ఆదేశించింది. క్రమబద్దీకరణ దరఖాస్తుపై నిర్ణయం తీసుకునేదాగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టమని తెలంగాణ ప్రభుత్వం తరుపున అదనపు సొలిసిటర్ జనరల్ హామీని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.12లో ఎనిమిది ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో పోలీస్ ట్విన్ టవర్లను నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టిన సంగతి తెలిసిందే. ఆ స్థలంలోని ఐదు ఎకరాల భూమి తమ స్వాధీనంలో ఉందని, అక్కడ పోలీస్ టవర్ల నిర్మాణాన్ని నిలిపివేయించి యాజమాన్య హక్కులు తమకే కల్పించాలని కోరుతూ మిర్ అఫ్సర్ అనే వ్యక్తి సహా 16 మంది హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషన్‌ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు నాలుగు వారాల పాటు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసింది.

దీనిని విచారించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసాలే, జస్టిస్ పి. నవీన్ రావులతో కూడిన ధర్మాసనం క్రమబద్ధీకరణ దరఖాస్తును తిరస్కరిస్తూ ఇచ్చిన మోమోలో కారణాలు పేర్కొనలేదని సింగిల్ జడ్జి ఆదేశాలను గత నెల 6న కొట్టివేసింది.
దానిని సవాల్ చేస్తూ పిటిషనర్లు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీంతో రెండు వారాల పాటు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications