సర్వే: గ్రేటర్‌పై గులాబీ జెండా, మజ్లీస్ కోటా యథాతథం
హైదరాబాద్: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గ్రేటర్ హైదరాబాదులో గులాబీ జెండా ఎగురుతుందని ఓ సర్వే తేల్చింది. నీల్సన్ ఎన్‌జీ మైండ్‌తో కలిసి ఎన్టీవీ చానెల్ గ్రేటర్ హైదరాబాదులో సర్వే నిర్వహించి, శనివారం సాయంత్రం ఆ ఫలితాలను వెల్లడించింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది.
సర్వే ఫలితాల ప్రకారం - టిఆర్ఎస్ 75 నుంచి 85 స్థానాలు గెలుచుకుంటుంది. జిహెచ్ఎంసిలో 150 డివిజన్లు ఉన్నాయి. తెలుగుదేశం - బిజెపి కూటమి రెండో స్థానంలో ఉంటుంది. ఈ కూటమి 20 నుంచి 25 డివిజన్లు గెలుచుకునే అవకాశం ఉంది.

కాంగ్రెసు చాలా వెనకబడే అవకాశం ఉంది. ఈ పార్టీకి 10 నుంచి 12 స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఇతరులు మూడు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. మజ్లీస్ కంచుకోటను మాత్రం టిఆర్ఎస్ బద్దలు కొట్టే అవకాశం లేదు. మజ్లీస్ 40 నుంచి 45 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది.
సీమాంధ్రులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా టిఆర్ఎస్‌కు మొగ్గు కనిపించడం విశేషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడడం, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకూ ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మధ్య సాన్నిహిత్యం పెరగడం అందుకు కారణంగా భావిస్తున్నారు.
టిఆర్ఎస్ ప్రారంభించిన పలు సంక్షేమ పథకాల వల్ల, ప్రకటించిన వరాల వల్ల హైదరాబాదు ప్రజలు టిఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు భావిస్తున్నారు. కాగా, తమకు 75 నుంచి 80 స్థానాలు వస్తాయని టిఆర్ఎస్ నాయకుడు, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు కూడా గత కొద్ది రోజులుగా చెబుతూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications