ఇర్ఫాన్ పనే కావచ్చు: సూర్యాపేట కాల్పులపై నాయని
హైదరాబాద్: నల్లగొండ జిల్లా సూర్యాపేటలో కాల్పులకు తెగబడింది ఇర్ఫాన్ కావచ్చునని తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కాల్పుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిఐ మొగిలయ్యను, హోంగార్డు కిశోర్‌ను మరో మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ఆయన గురువారం ఉదయం పరామర్సించారు.
ఇర్ఫాన్‌ను సిఐ మొగిలయ్య 15 రోజుల క్రితం అరెస్టు చేశాడని, అతనే బెయిల్‌పై విడుదలై ఈ కాల్పులకు తెగబడి ఉండవచ్చునని నాయని అన్నారు. సంఘటనా స్థలంలో ఒడిషాకు చెందిన ఐడి కార్డు కనిపించినట్లు సమాచారం. దర్యాప్తును తప్పుదారి పట్టించడానికే దాన్ని అక్కడ వదిలి వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు.

గాయపడిన మొగిలయ్య శరీరంలో రెండు బుల్లెట్లు ఉన్నట్లు కిమ్స్ వైద్యులు చెప్పారు. మొగిలయ్యకు శస్త్ర చికిత్స అవసరమని వారు చెప్పారు. గాయపడిన కిశోర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వారు చెప్పారు.
కాగా, గాయపడినవారి చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి నాయని చెప్పారు. మరణించిన కానిస్టేబుల్స్ కుటుంబాలకు 40 రూపాయలేసి ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. గాయపడిన కానిస్టేబుల్‌కు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ఆయన చెప్పారు. సంఘవిద్రోహ శక్తులను ఎదుర్కోవడంలో పోలీసులు ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నారని ఆయన ప్రశంసించారు.
నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండులో బుధవారం అర్థరాత్రి జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించిన విషయం తెలిసిందే. సంఘటన జరిగిన హైటెక్ బస్టాండ్‌ను రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మ పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications