మునుగోడు లేటెస్ట్ సర్వేలో తేలిందేంటి - ఆ 9వేల ఓట్లే కీలకంగా..!!
ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మునుగోడు చుట్టూ తిరుగుతున్నాయి. మునుగోడు ఓటర్ల నాడి పసి గట్టేందుకు సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఐ ప్యాక్ సంస్థకు చెందిన సభ్యులు కాంగ్రెస్ కు ఎప్పటికిప్పుడు సమాచారం ఇస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని రిపోర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రచారం తీవ్ర తరం చేసింది. కాంగ్రెస్ నుంచి మహిళా అభ్యర్ధి బరిలో ఉండటంతో సెంటిమెంట్ పండిస్తున్నారు. మహిళల ఓట్లు రాబట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ అనుబంధ సంఘం ఎన్ఎస్ యూఐ నేతలు ఓటర్లకు కాలు మొక్కి వారిని ప్రసన్నం చేసుకొనేందుకు ముందుకొచ్చారు. అటు బీజేపీ మొత్తంగా తమ అభ్యర్ది కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి పైనే భారం వేసింది. నియోజకవర్గంలో పట్టు ఉన్న కోమటిరెడ్డి ఎక్కడ ఎటువంటి వ్యూహాలు అమలు చేయాలే సూచిస్తున్నారు. బీజేపీ కోర్ కమిటీ సభ్యులు మునుగోడు కేంద్రంగా ప్రచారంలో నిలిచారు. ఇక, అధికార టీఆర్ఎస్ మంత్రులు -ఎమ్మెల్యేలతో భారీ సైన్యాన్ని మునుగోడులో మొహరించింది. సీఎం కేసీఆర్ మనుగోడు ప్రచారంలో మరోసారి ప్రత్యక్షం కాబోతున్నారు. భారీ బహిరంగ సభకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆసక్తి కర సర్వే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

మూడు ప్రధాన పార్టీలు బరిలో నిలవటంతో నియోజకవర్గంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా బీసీ వర్గాల్లో మూడు పార్టీల మద్దతు దారుల పైన ఇప్పటికే సర్వే సంస్థలు దాదాపుగా ఒక అంచనాకు వచ్చాయి. కాగా, అందులోని తొమ్మది వేల మంది ఓటర్లు మాత్రం ఇంకా నిర్ణయానికి రాలేదని.. ఒక జాతీయ పార్టీకి క్షేత్ర స్థాయి సమాచారం ఇస్తున్న ఒక ప్రముఖ సర్వే సంస్థ తేల్చింది. వారంతా గతంలో కోమటిరెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేయటంతో, పార్టీ కోసం మద్దతుగా రాజగోపాల్ కు సపోర్ట్ చేసిన వారుగా గుర్తించారు. కానీ, ఇప్పుడు హోరా హోరీగా పోరాటం సాగుతున్న సమయంలో ఆ తొమ్మది వేల ఓటర్లు మొత్తంగా ఫలితాన్నే మార్చే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ తొమ్మది వేల ఓట్లలో ఎక్కువ శాతం గౌడ - యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఆ సర్వే సంస్థ ఇచ్చిన నివేదికలో తేల్చింది. దీంతో..ఇప్పుడు ఆ ఓట్ల కోసం మూడు ప్రధాన పార్టీలు ఆ సామాజిక వర్గాలకు చెందిన నేతల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారు. దుబ్బాకలో చివరి రౌండ్ వరకు ఫలితం ఏ విధంగా టెన్షన్ పెట్టిందో..మునుగోడులోనూ దాదాపుగా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందనే చర్చ ఇప్పటికే ప్రచారంలో ఉన్న నేతల మధ్య వినిపిస్తోంది. దీంతో.. ఇప్పుడు సర్వే సంస్థలు ఇస్తున్న నివేదికలు రాజకీయ పార్టీలకు కీలకంగా మారాయి. దీపావళి తరువాత మునుగోడులో ప్రచారం నెక్స్ట్ లెవల్ కు వెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications