వాట్సాపా మజాకా.. గంటలో దొంగను పట్టించిందిగా..
ప్రస్తుతం టెక్నాలజీ అన్ని రంగాల్లోకి వచ్చేసింది. డిజిటల్ టెక్నాలజీ సాయంతో ఎన్నో ప్రశ్నలకు పరిష్కారాలు దొరుకుతున్నాయి. మనం నిత్యం వాట్సాప్ ను వాడుతుంటాం. ఫ్రెండ్స్, ఫ్యామిలీకు మెసేజ్ లు, వీడియో కాల్స్ చేసేందుకు ఉపయోగిస్తుంటాం. అయితే వాట్సాప్ తో దొంగలను కూడా పట్టుకోవచ్చని మీకు తెలుసా..? తాజాగా ఓ దొంగను.. చోరీ చేసిన గంట వ్యవధిలోనే పట్టించింది వాట్సాప్ గ్రూప్. ఈ ఘటన హైదరాబాద్ లోని బొల్లారంలో జరిగింది.
హైదరాబాద్ లోని బొల్లారం పరిధిలోని అల్వాల్ లో ఝార్ఖండ్ కు చెందిన బిపిన్ రాజ్ యాదవ్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఎప్పటిలాగే రాత్రి ఇంటిముందు ఆటోను పార్కింగ్ చేశాడు. అయితే మరుసటి రోజు ఉదయం బయటికి వచ్చి చూడగా ఆటో కనిపించలేదు. దీంతో సమీపంలోని సీసీ కెమెరాలను బిపిన్ రాజ్ పరిశీలించాడు. దానిలో అర్ధ రాత్రి 2 గంటల సమయంలో ఓ వ్యక్తి తన ఆటోను తీసుకెళ్తున్నట్లు గుర్తించాడు.
వెంటనే ఆటోకు సంబంధించిన ఫొటోలను, సీసీ కెమెరా ఫుటేజీని 'ఝార్ఖండ్ ఏక్తా సమాజ్' అనే వాట్సాప్ గ్రూప్ లో పోస్టు చేశాడు. అలాగే ఆ గ్రూపులోని సభ్యులు ఈ సమాచారాన్ని ఇతర గ్రూపులకూ షేర్ చేశారు. అయితే బంజారాహిల్స్ రోడ్డునెంబర్-10 స్టార్ ఆసుపత్రి దగ్గర ఓ ఝార్ఖండ్ వాసి తన ఆటోను పార్కింగ్ చేస్తుండగా పక్కనే చోరీకి గురైన ఆటో కనిపించింది. ఓ వ్యక్తి ఆ ఆటోపై ఉన్న స్టిక్కర్లను తొలగిస్తూ ఉన్నాడు. వెంటనే ఈ ఘటనను వీడియో తీసి గ్రూప్ లో షేర్ చేశాడు.

వెంటనే ఆ గ్రూప్ లోని సభ్యులు అక్కడకు చేరుకుని నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో అతడు జీడిమెట్లకు చెందిన రోహిత్ గా గుర్తించారు. దొంగిలించిన ఆటోను తన స్నేహితుడు రఘురామ్కు ఇవ్వగా.. అతడు తన బంధువులను తీసుకెళ్లే క్రమంలో బంజారాహిల్స్ లో దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications