• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్వైన్‌ఫ్లూ స్వైర విహారం: ఇటు డెంగ్యూ విజృంభణ

By Swetha Basvababu
|

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రభుత్వం వైద్య వసతులు కల్పించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నది. కానీ అంటు వ్యాధులు ప్రత్యేకించి ప్రాణంతక వ్యాధుల్లో ఒక్కటైన స్వైన్‌ఫ్లూ స్వైరవిహారం చేస్తున్నది. డెంగ్యూ విజృంభిస్తున్నది. రాష్ట్రంలో ఏ ఆస్పత్రిలో చూసినా ఈ వ్యాధుల రోగులే ఎక్కువగా కనబడుతున్నారు. ఇటీవల వర్షాలు బాగా కురిసి అపరిశుభ్రత పెరగడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.

దీంతో డెంగ్యూ కేసులు పెరిగి ప్రాణాలు తోడేస్తున్నాయి. మరోవైపు, వర్షాలతో తేమ వాతావరణం ఏర్పడటంతో స్వైన్‌ఫ్లూ వైరస్‌ అంతకంతకు పెరుగుతున్నది. ఈ వ్యాధి కారక హెచ్‌1ఎన్‌1 తేమ వాతావరణంలో శక్తిని పుంజుకుని ప్రజలపై దాడి చేస్తున్నది. జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌ నగర పరిసరాల్లోనే వైరస్‌ ఎక్కువగా ఉన్నది.

రోజుకు కనీసం 41 మంది బ్లడ్ శాంపిల్స్ పరీక్షిస్తుండగా సగటున 13.2 శాతం కేసులు నమోదు అవుతున్నాయి. స్వైన్‌ ఫ్లూతో ఈ ఏడాది ఇప్పటి వరకు 39 మంది మృతిచెందగా డెంగ్యూ వ్యాధితో 18 మంది మరణించారు. ఈ రెండు వ్యాధుల కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. స్వైన్‌ ఫ్లూ 1,928, డెంగ్యూ కేసులు 1,652 నమోదయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కువ మంది రోగులు చేరుతున్నారు. దీంతో కేసులు సైతం అంతేస్థాయిలో పెరుగుతున్నా అధికారుల దృష్టికి రావడంలేదు.

 2015లో అత్యధికంగా స్వైన్ ఫ్లూ, డెంగ్యూ కేసులు

2015లో అత్యధికంగా స్వైన్ ఫ్లూ, డెంగ్యూ కేసులు

ఇక స్వైన్‌ఫ్లూ ప్రధాన నోడల్‌ కేంద్రం గాంధీ ఆస్పత్రిలోని డిజాస్టర్‌ వార్డు రోగులతో పూర్తిగా నిండిపోయింది. రాష్ట్రంలో ఎక్కడ కేసు నమోదైనా ఇక్కడికి రిఫర్‌ చేస్తుండటంతో 20 పడకలు నిండిపోయాయి. 2015లో అత్యధికంగా 3,193 స్వైన్ ఫ్లూ, 1,830 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 2011లో తొలిసారి ఈ వ్యాధి సోకింది. 2011లో 11 మందికి స్వైన్ ఫ్లూ సోకగా, 769 మంది డెంగ్యూ వ్యాధితో బాధ పడ్డారు. గతేడాది (2016)లో 4037 మంది డెంగ్యూతో, 173 మంది స్వైన్ ఫ్లూతో సమస్యనెదుర్కొన్నారు. 2012లో 321 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా, 962 మంది డెంగ్యూతో ఇబ్బంది పడ్డారు. 2013, 2014ల్లో స్వైన్ ఫ్లూ వ్యాధి తగ్గుముఖం పట్టినా, డెంగ్యూ వ్యాధితో 345 మంది, 684 మంది ఇబ్బందుల పాలయ్యారు.

పరిస్థితి విషమించాకే గాంధీకి తరలింపు

పరిస్థితి విషమించాకే గాంధీకి తరలింపు

రెట్టింపు స్థాయిలో వణికిస్తున్న స్వైన్ ఫ్లూప్రైవేట్ ఆస్పత్రులు రోగుల ఆరోగ్య పరిస్థితి విషమించిన తరువాత గాంధీ ఆస్పత్రికి పంపుతుండటంతో మరణాలు సంభవిస్తున్నాయన్నారు. వేసవికాలంలోనూ ప్రతాపాన్ని చూపించిన స్వైన్‌ఫ్లూ ప్రస్తుతం అంతకన్నా రెట్టింపు స్థాయిలో వణికిస్తున్నది. ఈ స్వైన్‌ఫ్లూ మహమ్మరితో శనివారం ఒకే రోజు ముగ్గురు మృతి చెందడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ప్రస్తుతం అనుకూలమైనన సీజన్‌ కావడంతో మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. పరిస్థితులను బట్టి ఆయా ఆసుపత్రుల్లో అదనపు బెడ్లను సమకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యం కోసం వస్తున్న రోగులను ఇతర ఆస్పత్రులకు పంపుతున్నట్టు అధికారులు తెలిపారు. దీనికితోడు సీజనల్‌ వ్యాధులు మలేరియా, డెంగ్యూ, కలరా, అతిసార, డిఫ్తీరియా, చికున్‌గున్యా ఇతర వ్యాధులు రోగులపై దండయాత్ర చేస్తున్నాయి.

నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు

నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు

పరిస్థితి ఇలా ఉంటే, సీజనల్‌ వ్యాధులతో వచ్చే రోగులను ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయి. అవసరం ఉన్నా, లేకున్నా పరీక్షలు చేస్తూ భారీగా దండుకుంటున్నాయి. చిన్నపాటి రోగంతో ఆస్పత్రి గడప తొక్కితే చాలు ఫీజుల పేరిట, పరీక్షల వేలకు వేల రూపాయల్లో వసూలు చేస్తున్నా అధికారుల పర్యవేక్షణ ఉండటంలేదు.. స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తులకు సర్కార్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామని చెబుతున్నా అవి ఏ మూలకు సరిపోవడంలేదు. కొన్ని ఆస్పత్రులు పరీక్షల పేరుతో లక్షల్లో వసూలు చేసి చివరకు ప్రభుత్వ ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నాయి. స్వైన్‌ఫ్లూ రోగ నిర్ధారణ, మందులు అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది.

 ఇలా ఏర్పాట్లు చేశామన్న నిమ్స్ డైరెక్టర్

ఇలా ఏర్పాట్లు చేశామన్న నిమ్స్ డైరెక్టర్

స్వైన్‌ఫ్లూ రోగులకు చికిత్స చేయాలంటేనే డాక్టర్లు సిబ్బంది హడలిపోతున్నారు. వైరస్‌ ఎప్పుడు తమపై విరుచుకు పడుతుందోనని భయంతో వణికిపోతున్నారు. గతంలో ఈ వ్యాధిగ్రస్తులకు చికిత్స చేసిన నర్సులు, డాక్టర్లు స్వైన్‌ఫ్లూ బారిన పడిన సంగతి తెలిసిందే. స్వైన్‌ఫ్లూ రోగికి చికిత్స చేయాలంటే చేతికి గ్లౌసులు, నోరు, ముక్కు కప్పివుండేలా మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. శరీరం పూర్తిగా కవరయ్యే దుస్తులు ధరించాలి. వాతావరణం చల్లగా ఉండే ప్రాంతాల్లో ఈ వైరస్‌ ఎక్కవగా ఉంటుందని, దీని నివారణపై ప్రధానంగా ద్రుష్టిపెట్టామని స్వైన్‌ఫ్లూ నోడల్‌ అధికారి, నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌ తెలిపారు. వ్యాధి లక్షణాలున్నవారికి మెరుగైన వైద్యం అందించేందుకు ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. గాంధీ ఆస్పత్రిలో 20 పడకలు, ఉస్మానియాలో 14, ఫీవర్‌ ఆస్పత్రిలో 26, నిలోఫర్‌, ఎంజీఎం (వరంగల్‌), నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 10 పడకల చొప్పున ప్రత్యేక స్వైన్‌ఫ్లూ వార్డులను సిద్ధం చేసినట్టు తెలిపారు.

ప్లేట్‌లెట్ల పేరిట పేషంట్ల జేబులకు చిల్లులు

ప్లేట్‌లెట్ల పేరిట పేషంట్ల జేబులకు చిల్లులు

డెంగ్యూ వ్యాధితోనూ అదే పరిస్థితి నెలకొంటున్నది. ప్లేట్‌లెట్లు పడి పోయాయని రోగుల జేబులకు ప్రైవేట్ దవాఖానాల యాజమాన్యాలు చిల్లులు పెడుతున్నాయి. ప్లేట్‌లెట్లు లక్ష కంటే తగ్గినప్పుడు రోజూ ఒక్కసారే పరీక్ష చేయాలి. కానీ రెండుమూడు సార్లు చేస్తూ రోజుకు రూ.10 వేలకు తగ్గకుండా పిండుకుంటున్నాయి. జ్వరం తగ్గాక ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. కానీ ఒక్కోక్కసారి పెరిగాక, మళ్లీ తగ్గి, మళ్లీ పెరుగుతాయి. దీని ఆసరాగా పరీక్షల మీద పరీక్షలు చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య 20,000 కంటే తగ్గితే ఆస్పత్రిలో చేరాల్సిందేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పరిశుభ్రత పాటిస్తేనే డెంగ్యూ నుంచి కేర్

పరిశుభ్రత పాటిస్తేనే డెంగ్యూ నుంచి కేర్

దోమ కుట్టిన ఏడెనిమిది రోజుల తర్వాత హఠాత్తుగా తీవ్రమైన జ్వరం వస్తుంది. కళ్లు కూడా కదిలించలేని పరిస్థితి ఉంటుంది. ఎముకల్లోనూ, కండరాల్లోనూ భరించలేని నొప్పి ఉంటుంది. వాంతులు, విరేచనాలు, రక్తంతో కూడిన మలవిసర్జన, కడుపునొప్పి వస్తాయి. రక్తపోటుతోపాటు రక్తకణాల సంఖ్య తగ్గిపోతుంది. కొన్నిసార్లు అకస్మాత్తుగా అవయవాలు పని చేయడం మానేస్తాయి. ఇది ప్రాణాపాయానికి దారి తీస్తుంది. ఈ వ్యాధి బారిన పడుకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఇంటి పరిసరాల్లో మురుగు నీరు, పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బొండాలు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీటి ట్యాంకులు, కుండలు, క్యాన్లు వారానికోసారి శుభ్రం చేసుకుంటూ దోమల్లేకుండా చూసుకోవాలి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీటి గుంటలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్లవర్‌ వాజ్‌, ఎయిర్‌కూలర్‌ నీళ్లను ప్రతిరోజు మార్చాలి. ఇంటిపై ఉండే ట్యాంకులకు మూతలు పెట్టాలి. తరచూ శుభ్రం చేసుకోవాలి. వర్షాకాలం ముగిసే వరకు పుల్‌ సైజ్‌ దుస్తులు ధరించాలి. ఇంటి మొత్తాన్ని మస్కిటో స్కిన్‌తో కవర్‌ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి పూట పడుకునే ముందు దోమ తెరను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. మస్కిటో రీఫిలెంట్స్‌ తప్పనిసరిగా వినియోగించాలి.

 స్వైన్ నివారణకు ఇలా జాగ్రత్తలు

స్వైన్ నివారణకు ఇలా జాగ్రత్తలు

స్వైన్‌ఫ్లూ సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా ఆ వైరస్‌ రోగి శరీరం నుంచి గాల్లోకి ప్రవేశిస్తుంది. ఆ వైరస్‌ వాతావరణంలో రెండు గంటలకుపైగా జీవిస్తుంది. ఇది సోకితే ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి, తుమ్ములు, కళ్ల వెంట నీళ్లు కారడం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. ముక్కుకు మాస్క్ ధరించడంతోపాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, వీలైనంత ఎక్కువగా నీరు తాగడం, పౌష్టికాహారం తీసుకోవడం, సాధ్యమైనంత వరకు తీర్థ యాత్రలు వెళ్లక పోవడం వల్ల ఫ్లూ బారీన పడకుండా కాపాడుకోవచ్చు. వ్యాధి లక్షణాలు ఉన్న వారు సాధ్యమైనంత వరకూ ఇంట్లోనే ఉండాలి. వీరు వాడిన రుమాలు, టవల్‌ వంటివి ఇతరులు ఉపయోగించరాదు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముఖానికి అడ్డంగా వస్త్రం పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి, మధుమేహం వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, ఐదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లకుపై బడిన వృద్ధులు, సీఓపీడీ, కాన్సర్‌, ఆస్తమా రోగులు, మూత్రపిండాల శస్త్రచికిత్స చేసుకున్న రోగులు, దీర్ఘకాలంగా స్టెరాయిడ్‌ తీసుకుంటున్న వారికి ప్రమాదం జరగవచ్చు.

English summary
Swine flu and Dengue fever were severly effected in Hyderabad. These deseages firstly effected in 2011. Mostly in 2015 3193 Swine flu, 1890 Dengue cases registered. Telangana Government has appointed Swinflu nodal officer Dr. Manohar and special wards in Osmania, Fever, Nilofer, Warangal in MGM, Nizamabad hospitals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X