నేను రెడీ: తలసాని, నోరు అదుపులో పెట్టుకోండి: కవిత హెచ్చరిక
నిజామాబాద్: తాను ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరఫున సనత్ నగర్ నుంచి గెలిచిన తలసాని ఆ తర్వాత టిఆర్ఎస్‌లో చేరి మంత్రి అయిన విషయం తెలిసిందే.
తలసాని రాజీనామా విషయంలో విపక్షాలు మండిపడుతున్నాయి. ఆయనకు గెలిచే ధైర్యం లేకే రాజీనామా చేయడం లేదంటున్నారు. దీనిపై ఆయన స్పందించారు. తాను ఉప ఎన్నికలకు రెడీగా ఉన్నానని చెప్పారు.
ప్రతి పక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటే ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించేది లేదని చెప్పారు. గత ప్రభుత్వాలు నిజామాబాద్ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు.
రాష్ట్రంలో సారా మహమ్మారిని పారద్రోలడానికే చీప్‌లిక్కర్‌ను తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. చీప్ లిక్కర్ పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆదాయం పెరిగిందన్నారు. కాంగ్రెస్ రాష్ర్టాన్ని గతంలో దోచుకుంది. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు.

సీనియర్ నేతలు నోటిని అదుపులో పెట్టుకోవాలి: కవిత
కొంతమంది సీనియర్ నాయకులు నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండలో నిర్వహించిన గ్రామజ్యోతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
పల్లెల రూపురేఖలు మార్చడమే గ్రామజ్యోతి లక్ష్యమన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందలేదన్నారు. నిజమైన లబ్ధిదారులకు ఏ పథకంలోనూ అన్యాయం జరగదని చెప్పారు.
చీప్ లిక్కర్ ఆపలేక: డికె అరుణ, 31న డిగ్గీ రాక, జగ్గారెడ్డి చేరిక
చీప్ లిక్కర్ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గాలని కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ అన్నారు. యువతను తాగుబోతులను చేయడమే మీ లక్ష్యమా అని ప్రశ్నించారు. ఆదాయం కోసం పేదల రక్తం తాగుతారా అని ధ్వజమెత్తారు. తెలంగాణను అనారోగ్యాల హబ్‌గా చేస్తారా అన్నారు. గుడుంబాను అరికట్టలేకపోవడం ప్రభుత్వం చేతగానితనం అన్నారు.
దిగ్విజయ్ రాక
ఈ నెల 31వ తేదీన దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ రానున్నారు. 1వ తేదీన వరంగల్ జిల్లాలో పర్యటిస్తారు. జగ్గారెడ్డి అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.












Click it and Unblock the Notifications