టీటీడీపీ నూతన అధ్యక్షుడిగా - చంద్రబాబు ఛాయిస్..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలంగాణ పై ఫోకస్ చేసారు. పార్టీ నేతలతో ఈ రోజు కీలక సమావేశం ఏర్పాటు చేసారు. కార్యకర్తలలో పాటుగా సాధారణ ప్రజలతోనూ కలవనున్నారు. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ డిసైడ్ చేయనున్నారు. ఆడహక్ కమిటీ వేసి జిల్లాలవారీగా సభ్యత్వ నమోదు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు పైన నిర్ణయం తీసుకోనున్నారు.
చంద్రబాబు సమీక్ష
తాజాగా జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో తెలంగాణలో పార్టీ బలోపేతం పైన చర్చ జరిగింది. తెలంగాణలో ఇప్పటికీ పదిశాతానికి పైగా ఓటు బ్యాంక్ టీడీపీకి ఉండటంతో.. పార్టీని యాక్టీవ్ చేయాలని నిర్ణయించారు. తెలంగాణలోనూ టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలని తీర్మానించారు. తెలంగాణలో త్వరలో పంచాయితీ ఎన్నికల దిశగా అడుగులు పడుతున్నాయి. టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయటం ద్వారా కేడర్ లో జోష్ పెరుగుతుందనే ఆలోచనలో ఉంది. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు ఈ రోజు సమావేశం కానున్నారు.

పార్టీ సభ్యత్వ నమోదు
ఈ సమావేశంలో చంద్రబాబు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే అంశంపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో పార్టీ సభ్యత్వం పెంచుకొనే క్రమంలొ భాగంగా సభ్యత్వ నమోదు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ మేరకు నేటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అదే సమయంలో పార్టీని పటిష్ఠం చేసే క్రమంలో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటు పైన ముఖ్య నేతలకు చంద్రబాబు మార్గదర్శకం చేయనున్నారు. స్థానిక సంస్థల్లో పోటీ అంశం పైన నేడు క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
కొత్త అధ్యక్షుడిగా
తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడిపై చంద్రబాబు అభిప్రాయ సేకరణ చేయనున్నారు. తెలంగాణ టీడీపీకి బీసీ నేతను అధ్యక్షుడిగా నియమించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా అరవింద్ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తరువాతనే అధ్యక్షుడిని ఖరారు చేయాలని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయాలని భావిస్తోంది. దీంతో, ఈ రోజు సమావేశంలో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications