రేవంత్ కు చంద్రబాబు గుడ్ న్యూస్ - అటు నుంచి ఆట మొదలు..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 51 రోజులుగా రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు తెలంగాణ ఎన్నికల పైన తన ఆలోచన ఏంటో స్పష్టం చేసారు. ఏపీలో అధికారమే లక్ష్యంగా చంద్రబాబు కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు.చంద్రబాబుతో కాసాని ములాఖత్ అయ్యారు. తెలంగాణ ఎన్నికల బరిలో నిలవాలని తాము కోరుకుంటున్నామని, పోటీకి అనుమతించాలని కోరారు. చంద్రబాబు నిర్ణయంతో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
ఎన్నికల్లో పోటీకి దూరంగా: తెలంగాణ ఎన్నికల్లో పోటీ పైన చంద్రబాబు తన మనసులో మాట తేల్చేసారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. చంద్రబాబు అరెస్ట్.. పొత్తుల లెక్కల్లో భాగంగా ప్పుడు తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించలేమని భావిస్తోంది. తెలంగాణలో ఆషామాషీగా, నామమాత్రంగా పోటీచేసేకంటే పూర్తిగా దూరంగా ఉండటమే మంచిదని నిర్ణయించుకుంది.

ఈ విషయాన్ని టీడీపీ-టీఎస్ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు చంద్రబాబు విడమరచి చెప్పినట్లు తెలిసింది. శనివారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబుతో కాసాని ములాఖత్ అయ్యారు. 89 నియోజవర్గాల్లో అభ్యర్దులు సిద్దంగా ఉన్నారని..పోటీకి అనుమతించాలని కోరారు. కానీ, చంద్రబాబు పోటీ వద్దని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
తేల్చేసిన చంద్రబాబు: ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తెలంగాణపై ఫోకస్ పెట్టలేమని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. దిగితే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలి. కానీ ఇప్పుడు పార్టీ పరంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మీరంతా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది మే నెలలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి. పూర్తి శక్తియుక్తులు కేటాయించి ఇక్కడ ఎన్నికల్లో పోరాడి ఫలితం సాధించాలని వివరించారు.
ఏపీలో విజయం సాధిస్తే తర్వాత తెలంగాణలో కూడా పార్టీకి తేలిగ్గా బలం పుంజుకుంటుందని చెప్పారు. ఆషామాషీగా పోటీ చేసి సరైన ఫలితం రాలేదని బాధపడే బదులు దూరంగా ఉండటమే మంచిదని అభిప్రాయపడినట్లు సమాచారం. సర్వసన్నద్ధంగా ఉండి పోరాడితే మంచి ఫలితాలు వస్తాయని,తాను చెప్పిన విషయాలపై పార్టీ నేతలు కూడా ఆలోచన చేయాలని సూచించారు.

కాంగ్రెస్ కు కలిసొచ్చేనా: అవసరమైతే మనం మరోసారి చర్చిద్దామని చంద్రబాబు తెలిపినట్లు సమాచారం. ఇప్పటికైతే పోటీ కష్టమని అనిపిస్తోందని కాసాని జ్ఞానేశ్వర్‌కు సర్దిచెప్పినట్లు తెలిసింది. దీంతో, ఈ రోజు తెలంగాణ టీడీపీ నేతలతో కాసాని సమావేశమై, చంద్రబాబు నిర్ణయం ఏంటో స్పష్టం చేయనున్నారు. టీడీపీ పోటీకి దూరంగా ఉండటం ద్వారా పరోక్షంగా రేవంత్ నాయకత్వానికి ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
చంద్రబాబు అరెస్ట్ తరువాత ఇప్పటికే తెలంగాణలోని టీడీపీ మద్దతు దారులు ఈ సారి కాంగ్రెస్ కు మద్దతిస్తామని బహిరంగంగానే చెబుతూ వచ్చారు. హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ లోని కొన్ని నియోజకవర్గాల్లో ఈ నిర్ణయం కాంగ్రెస్ కు మేలు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. అటు బీజేపీ -జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయం వెనుక ఏపీ భవిష్యత్ సమీకరణాలే అసలు లక్ష్యంగా స్ఫష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications