టీటీడీపీ నేతలంతా కాంగ్రెస్‌లో చేరాలి: టిఆర్ఎస్ ఓటమి కోసం వీహెచ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్)ను ఓడించాలని పట్టుదలే ఉంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలంతా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని రాజ్యసభ సభ్యుడు వి హన్మంతరావు సూచించారు.
ఆదివారం సీఎల్పీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్, టిఆర్ఎస్‌ల మధ్యనే పోటీ ఉంటుందని, మరో పార్టీకి అవకాశం ఉండదన్నారు. టిడిపికి తెలంగాణలో మనుగడ ఉండదని, ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌లోకి వస్తే టిఆర్ఎస్‌ను అన్ని విధాలా ఎదుర్కోవచ్చన్నారు.

ఇది ఇలా ఉండగా, వరంగల్, ఖమ్మం నగర పాలక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ఈ రెండు చోట్ల తమకు బలమైన పార్టీశ్రేణులున్నాయని చెప్పారు. ఎన్నికలను సవాలుగా తీసుకొని పనిచేస్తామన్నారు.
నగరపాలక ఎన్నికలకు కాంగ్రెస్ ఇంఛార్జులు
వరంగల్, ఖమ్మం నగర పాలక సంస్థల ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీలను నియమించింది. వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికలకు పార్టీ ఇన్‌ఛార్జులుగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎం కోదండరెడ్డిలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియమించారు.
ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికలకు శాసనసభ్యుడు సంపత్‌కుమార్, శాసనమండలి సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలకు బాధ్యతలను అప్పగించారు. ఈ ఇన్‌ఛార్జులు సోమవారం వరంగల్, ఖమ్మం వెళ్లి అక్కడి నేతలతో సమావేశమవుతారు. అభ్యర్థుల ఎంపికపై చర్చించి, నిర్ణయం తీసుకుంటారు.












Click it and Unblock the Notifications