తెలంగాణకు మరో భారీ పెట్టుబడి: TechnipFMC సెంటర్ ఏర్పాటు, 3వేల ఉద్యోగాలు
హైదరాబాద్: రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే పలు ఎంఎన్సీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. తాజాగా, మరో ప్రముఖ సంస్థ ఈ జాబితాలో చేరింది. ఫ్రెంచ్-అమెరికన్ ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తుల దిగ్గజం టెక్నిప్ ఎఫ్‌ఎంసీ (Technip FMC) రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది.
సాఫ్ట్‌వేర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ అండ్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి హైదరాబాద్(Hyderabad)ను కేంద్రంగా ఎంచుకుంనది. రూ.1250 కోట్లతో హైదరాబాద్ నగరంలో కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ఇంజినీరింగ్ విభాగంలో 2500 ఉద్యోగాలు, తయారీ రంగంలో మరో వెయ్యి ఉద్యోగాలు రానున్నాయి. మొత్తంగా మరో 3500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

టెక్నిప్ ఎఫ్‌ఎంసీ నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల హైదరాబాద్‌కు అదిపెద్ద ప్రోత్సాహం లభించినట్లయిందని, నగర సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్.
ఇది ఇలావుండగా, మధుమేహుల కోసం ఇన్సులిన్ ఉత్పత్తి చేసే 'జెనిసిస్' బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విస్తరణ ప్రణాలికలపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో 50 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టిన ఆ సంస్థ మరో 50 నుంచి 60 మిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడితో 'రీ కాంబినెంట్ బల్క్ మాన్యుఫ్యాక్చరింగ్' కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంతో ఇన్సులిన్ ధరలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు.
మరోవైపు, హెల్త్ కేర్‌లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కలిగిన 3ఎం హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(హెచ్ఐఎస్), ఈసీఎల్ఏటీ హెల్త్ సోల్యూషన్స్(ECLAT Health Solution) సంయుక్తంగా తెలంగాణలోని కరీంనగర్‌లో కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో 3ఎం, ఈసీఎల్ఏటీ అధికారులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంతో ఆ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఆ సెంటర్ మెడికల్ కోడింగ్, క్లినికల్ డాక్యుమెంటేషన్ సేవల్ని అందించనుంంది. కరీంనగర్‌లో ఏర్పాటు చేయనున్న ఈసీఎల్ఏటీ ఆపరేషన్స్ సెంటర్‌లో వంద మందికి ఉద్యోగం కల్పించనున్నారు. ఆ తర్వాత ఆ సెంటర్‌లో ఉద్యోగుల సంఖ్యను 200కు పెంచనున్నట్లు పేర్కొన్నారు.
Delighted to announce that @TechnipFMC, a French American Oil and Gas giant selects Hyderabad as a key hub for their software Global Delivery Center & Precision Engineering Manufacturing Facility, creating 2,500 jobs in engineering and 1,000 jobs in the manufacturing facility… pic.twitter.com/G9L6EgVwHf
— KTR (@KTRBRS) May 20, 2023
ఈసీఎల్ఏటీ హెల్త్‌కేర్ సంస్థతో కుదిరిన ఒప్పందం గురించి మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. సుమారు 40 ఏళ్ల నుంచి 3ఎం హెచ్ఐఎస్ హెల్త్‌కేర్ రంగంలో సేవలు అందిస్తోంది. ఆ సంస్థ అత్యాధునిక హెల్త్‌కేర్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. దాదాపు 18 దేశాల్లో ఆ సంస్థ సేవలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందిచడమే లక్ష్యంగా ఆ సంస్థ సేవలు అందిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, 3ఎంతో పాటు ఈసీఎల్ఏటీ మధ్య సహకారం గురించి సమావేశంలో విస్తృతంగా చర్చించారు.












Click it and Unblock the Notifications