వీకెండ్.. లాక్‌డౌన్?: తెలంగాణలో మొదటికొచ్చిన కరోనా కథ: మూడువేలకు చేరువగా
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ కథ మళ్లీ మొదటికొచ్చింది. తెలంగాణలో రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మొన్నటిదాకా ఒకట్రెండు పాజిటివ్ కేసులకే పరిమితమైన పలు జిల్లాల్లో ఆ సంఖ్య పెరుగుదల బాట పట్టింది. రెండంకెల వరకు కొత్త కేసులు వెలుగులోకి వస్తోన్నాయి. కరోనా మరణాల్లోనూ పెరుగుదల చోటు చేసుకుంటోంది. ఈ పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవడానికి సమాయాత్తమౌతున్నట్లు తెలుస్తోంది. వారాంతపు రోజుల్లో లాక్‌డౌన్ విధించాలని భావిస్తున్నట్లు సమాచారం.

కొత్తగా 313 కరోనా కేసులు..
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 337 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు మరణించారు. 181 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,03,455కు చేరుకుంది. ఇందులో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 2,98,826 మంది ఉన్నారు. 1,671 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కేసులు మూడువేలకు చేరువ అయ్యాయి. తాజా బులెటిన్ ప్రకారం.. 2,958 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 1,226 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

గ్రేటర్‌లోనే అధికం..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా 91 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదివరకటి రోజువారీ కేసులతో పోల్చుకుంటే ఈ సంఖ్య తక్కువే. అయినప్పటికీ.. క్రమంగా పెరుగుతున్నాయి. ఆందోళన కలిగిస్తున్నాయి. మాస్కులను ధరించకపోవడం వల్ల కరోనా కేసులు మరోసారి విజృంభిస్తున్నాయనేది అభిప్రాయం అధికారుల్లో నెలకొంది. కరోనా ముందు జాగ్రత్త చర్యల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ బహిరంగ ప్రదేశాల్లో బ్యానర్లను ఏర్పాటు చేస్తోన్నారు. లాక్‌డౌన్ తరహా పరిస్థితులను నివారించడానికి ప్రజలు ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవడం ఒక్కటే మార్గమని అధికారులు స్పష్టం చేస్తోన్నారు.

జిల్లాలవారీగా లెక్కలివీ..
జిల్లాలవారీగా ఆదిలాబాద్-8, భద్రాద్రి కొత్తగూడెం-4, జగిత్యాల-8, జనగామ-4, జోగుళాంబ గద్వాల-4, కామారెడ్డి-3, కరీంనగర్-10, ఖమ్మం-9, మహబూబ్‌నగర్-9, మహబూబాబాద్-4, మంచిర్యాల-8, మెదక్-5, మేడ్చల్ మల్కాజ్‌గిరి-28, ములుగు-1, నాగర్ కర్నూల్-4, నల్లగొండ-8, నారాయణ్‌పేట్-1, నిర్మల్-18, నిజామాబాద్-11, పెద్దపల్లి-5, రాజన్న సిరిసిల్ల-8, రంగారెడ్డి-37, సంగారెడ్డి-12, సిద్ధిపేట్-6, సూర్యాపేట్-5, వికారాబాాద్-8, వనపర్తి-3, వరంగల్ రూరల్-5, వరంగల్ అర్బన్-7, యాదాద్రి భువనగిరి-3 కేసులు నమోదు అయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కొత్తగా ఒక్క కేసూ నమోదు కాలేదు.

95 లక్షలకు చేరువగా టెస్టింగులు..
తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 37,079 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన పరీక్షలు 31,766 కాగా.. మిగిలినవీ ప్రైవేటు హాస్పిటల్స్‌లో నమోదయ్యాయి. కొత్త వాటితో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం టెస్టింగుల సంఖ్య 96,50,662గా నమోదైంది. సగటున ప్రతి 10 లక్షల జనాభాకు 2,59,286 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు.

పాక్షిక లాక్‌డౌన్ విధించే ఛాన్స్
కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారని అంటున్నారు. వారాంతపు రోజుల్లో లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వారంలో మూడు రోజుల పాటు లాక్‌డౌన్ లేదా రాత్రిపూట కర్ఫ్యూపై విధించే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంటోంది. నాగ్‌పూర్, ఇండోర్, భోపాల్, జబల్‌పూర్‌లల్లో ఆదివారం పూట లాక్‌డౌన్ విధిస్తున్నారు. గుజరాత్, పంజాబ్‌లోని ప్రధాన నగరాల్లో రాత్రివేళ కర్ఫ్యూ అమల్లోకి తెచ్చారు. అవే పరిస్థితులు తెలంగాణలో ఏర్పడొచ్చనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications