రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ: కత్తులు నూరుతున్న విపక్షాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపు బుధవారం ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు ప్రతిపక్షాలు కత్తులు నూరుతున్నాయి. రైతుల ఆత్మహత్యలపై శాసనసభ అట్టుడికే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, తాము ఎన్ని రోజులైనా తాము సమావేశాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) చెబుతోంది.
ప్రతిపక్షాలు పారిపోయే విధంగా శాసనసభలో వ్యవహరించాలని, అన్ని విషయాలపై చర్చ పెడుదామని ముఖ్యమంత్రి కెసిఆర్ తన పార్టీ శాసనసభ్యులకు సూచించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు అధికారులు సర్వంసిద్ధం చేశారు. రేపు ఉదయం 10 గంటలకు శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఉభయ సభలు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, దివంగత కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డికి సంతాపం ప్రకటించనున్నాయి. అనంతరం సభ వాయిదా పడనుంది. అసెంబ్లీ ఆవరణలో మధ్యాహ్నం 12 గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇదిలావుంటే, శాసనసభను సజావుగా నడిపించాలని కాంగ్రెసు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రైతు ఆత్మహత్యలపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో రెండవ స్థానంలో ఉండడం దారుణమని ఆయన అన్నారు. రైతులు చావులకు భయపడడం లేదని, బతకడానికి భయపడుతున్నారని ఆయన అన్నారు.
తమ పార్టీ తరఫున 21 సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని ఆయన చెప్పారు. సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని ఆయన కోరారు. సమస్యలన్నింటిపైనా కచ్చితంగా చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలావుంటే, శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా అంటోంది. రైతుల ఆత్మహత్యలు, కరువు, రుణమాఫీ అంశాలపై సభలో పోరాటం చేస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పోడు భూములు, దళితులు, గిరిగజనుల సమస్యలను కూడా ప్రస్తావిస్తామని అన్నారు. రైతులను, వారి సంక్షేమాన్ని కెసిఆర్ ప్రభుత్వం విస్మరించిందని ఆయన విమర్శించారు.
కాగా, మంగళవారంనాడు జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రులకు, శాసనసభ్యులకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్షాలను ఎదుర్కునే వ్యూహంపై ఆయన చర్చలు జరిపారు. ప్రతి విషయంపై పూర్తి అవగాహనతో సభకు రావాలని ఆయన మంత్రులకు సూచించారు.












Click it and Unblock the Notifications