కేటీఆర్.. టీ బ్రేక్: ఫేమస్ కేఫ్‌లో గరంగరం చాయ్
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార జోరు పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి. ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది.
తెలంగాణలో ఈ నెల 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడత, మిజోరంలల్లో పోలింగ్ ముగిసింది.

నామినేషన్ల దాఖలు ప్రక్రియ కూడా ముగిసింది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మొత్తంగా 4,795 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. 13వ తేదీన వాటి స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్ పేపర్లను ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ 15.
ఎన్నికల ప్రచారంలో తీరిక లేెకుండా గడుపుతున్నారు ఆయా పార్టీల నేతలందరూ. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీ కిషన్ రెడ్డి, డాక్టర్ కెే లక్ష్మణ్.. ఇలా సీనియర్లందరూ జిల్లాస్థాయిలో సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. ఇలా జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దిగారు.
పోలింగ్ గడువు సమీపిస్తోండటంతో కేసీఆర్ తన ఎన్నికల ప్రచార కార్యక్రమాలను మరింత ముమ్మరం చేశారు. నేటి నుంచి మలివిడత ప్రచారానికి తెర తీయనున్నారు. 28వ తేదీ వరకు విరామం లేకుండా జిల్లాల్లో సుడిగాలి పర్యటలను నిర్వహించనున్నారు. నేడు బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేట, భద్రాచలంలల్లో ప్రజా ఆశీర్వాద బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు.

అటు కేటీఆర్ దీపావళి పండగను పురస్కరించుకుని ఎన్నికల ప్రచారం నుంచి స్వల్పంగా విరామం తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి ఆయన మలి విడత ప్రచారానికి దిగనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
పండగ రోజున ఆయన హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని ఫేమస్ నిలోఫర్ కేఫ్‌కు వెళ్లారు. టీ రుచి చూశారు. కేఫ్‌లో ఉన్న వారితో మాట్లాడారు. చిన్నపిల్లలను ఎత్తుకుని సందడి చేశారు. ఈ నెల 30వ తేదీన పోలింగ్ రోజు నాడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారంటూ తనకు ఫీడ్ బ్యాక్ లభించిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేసిన సంక్షేమం- అభివృద్ధిపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని, మరోసారి బీఆర్ఎస్‌కు అధికారాన్ని అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.












Click it and Unblock the Notifications