కాంగ్రెస్ గెలిస్తే.. వెంటనే ఆ పని చేస్తా: ఉత్తమ్ సంచలన ప్రకటన
Uttam Kumar Reddy: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇంకాస్సేపట్లో వెల్లడి కానున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ ఆరంభమౌతుంది. దీనికోసం కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లల్లో కూడా నేడే ఫలితాలు వెలువడనున్నాయి. మిజోరం ఎన్నికల ఓట్ల లెక్కింపును కూడా ఇవ్వాళే చేపట్టాల్సి ఉన్నప్పటికీ.. ఆ రాష్ట్ర రాజకీయ నాయకుల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు ఈ ప్రక్రియను సోమవారానికి వాయిదా వేసింది కేంద్రం ఎన్నికల కమిషన్.

తెలంగాణలో పోలింగ్ ముగిసిన రోజు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టిన విషయం తెలిసిందే. ఒకట్రెండు ఎగ్జిట్ పోల్స్ హంగ్ వైపు మొగ్గు చూపాయి. అంతే గానీ.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తీరుతుందంటూ ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా స్పష్టం చేయలేదు. హస్తం పార్టీకి భారీ మెజారిటీని అందించాయి.
ఫలితంగా- కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఆ పార్టీ నాయకులందరూ సంబరాలు చేయడానికి సన్నద్ధం అయ్యారు. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తోందనే సంకేతాలు కూడా అందుతున్నాయి.
కాంగ్రెస్ గెలుపు ఖాయమంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో- ఆ పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తన ప్రతిజ్ఞ నెరవేరే రోజు వచ్చిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే తాను గడ్డం తొలగిస్తానని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతే తాను గెడ్డం తొలగిస్తానంటూ గతంలో చేసిన ప్రతిజ్ఞను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications