వరంగల్‌పై బీజేపీ కన్ను: రంగంలోకి ఏడుగురు కేంద్ర మంత్రులు..!
హైదరాబాద్: టీడీపీతో పొత్తులో భాగంగా వరంగల్ లోక్‌సభ సీటు తెలంగాణ బీజేపీకి కేటాయించనున్న సంగతి తెలిసిందే. దీంతో వరంగల్ ఉపఎన్నికను తెలంగాణ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వాలని భావిస్తుంది.
వరంగల్ ఉపఎన్నికలో గెలిచి బీజేపీ తన సత్తా చాటాలని ఊవిళ్లురుతోంది. గెలిచే బలమైన అభ్యర్ధి కోసం ఇప్పటికే అన్వేషణ ప్రారంభించింది. రాజకీయాలతో సంబంధం లేని ఒక బలమైన అభ్యర్ధి కోసం తెలంగాణ బీజేపీ అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్ ఉపఎన్నిక కోసం తెలంగాణ బీజేపీ ఏడుగురు కేంద్ర మంత్రులను రంగంలోకి దించనుంది.
ఇప్పటికే వరంగల్ ఉపఎన్నికకు అభ్యర్ధిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 29 నుంచి వచ్చే నెల 5 వరకూ వరంగల్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు జరపాలని నిర్ణయించింది. పార్లమెంట్ నియోజక వర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఒక్కో అసెంబ్లీని ఒక్కో కేంద్ర మంత్రికి అప్పగించాలని భావిస్తోంది.

కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, ఎం వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, సంతోష్ గంగ్వార్, హన్సరాజ్ గంగారాం, బండారు దత్తాత్రేయ, చౌదరీ వీరేందర్ సింగ్ లకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గాన్ని అప్పగించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణకు కేంద్రం ఎన్నో నిధులు ఇస్తున్నప్పటికీ, ఆ నిధులను కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందనేది తెలంగాణ బీజేపీ నేతల ప్రధాన ఆరోపణ.
యాదగిరిగుట్ట నుంచి హన్మకొండ వరకూ జాతీయ రహదారి కోసం రూ. 1,900 కోట్లు కేంద్రం ఇస్తే, పనులకు శంకుస్థాపన జరుగకుండా కేసీఆర్ అడ్డుపతుతున్నారని బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కేసీఆర్ ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి స్వయంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని బీజేపీ వాడుకోనున్నట్లు తెలంగాణ బీజేపీ నేతలు వెల్లడించారు.












Click it and Unblock the Notifications