టీ న్యూస్‌కు నోటీసులు: 'ఏబీఎన్‌పై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు'
హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మొదటిసారి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు రెండు పోటీపడి తప్పులు చేస్తున్నాయని అన్నారు.
ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోలేదనడం అవాస్తవమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తన పరిధి మేరకు జోక్యం చేసుకుంటుందని చెప్పారు. తెలంగాణ పోలీసులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా తమ పార్టీకి ఉందన్న కిషన్ రెడ్డి, మీడియా స్వేచ్ఛకు తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు.

టీ న్యూస్‌కు ఏపీ ప్రభుత్వం నోటీసులు పంపడంపై తెలంగాణ ప్రభుత్వం మండపడుతున్న నేపథ్యంలో, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విషయంలో సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
టీ న్యూస్‌కు నోటీసులు ఉపసంహరించుకోండి: టీటీడీపీ నేతలు
తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతల భేటీ ముగిసింది. ఈ భేటీలో టీ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబును కోరిననట్టు తెలుస్తోంది.
అలా చేయని పక్షంలో తెలంగాణ జర్నలిస్టులతో తమకు ఇబ్బందులు ఎదురవుతాయని వారు చంద్రబాబుకు సూచించారు. శుక్రవారం రాత్రి టీ న్యూస్ ఛానల్‌కు విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబుతో శనివారం ఉదయం గరికపాటి రామ్మోహన్ రావు, వేం నరేందర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు తదితరులు భేటీ అయ్యారు.
టీ న్యూస్ ఛానల్‌కు నోటీసులు ఏపీ పోలీసులు ఇవ్వడంతో తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. మీడియాకు ఏపీ సర్కారు సంకెళ్లు వేసేందుకు కుట్ర పన్నుతుందని నినాదాలు చేశారు. మెదక్ జిల్లా దుబ్బాకలో జర్నలిస్టులు, న్యాయవాదులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మను దహనం చేశారు.












Click it and Unblock the Notifications