తెలంగాణ బడ్జెట్ 2.56లక్షల కోట్లు; దళిత బంధు బడ్జెట్ కేటాయింపులపై మంత్రి హరీష్ చెప్పిందిదే!!
తెలంగాణ అసెంబ్లీలో 2022- 23 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు మంత్రి హరీష్ రావు. 2.56లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు ఈ బడ్జెట్లో దళిత బందుకు పెద్దపీట వేసినట్లుగా వెల్లడించారు. సామాజిక వివక్ష అంతమొందించే ఆయుధం తెలంగాణ దళిత బంధు కార్యక్రమం అని, ఈ కార్యక్రమం దేశానికే దిశానిర్దేశం చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. బడ్జెట్లో దళిత బంధు పథకం కింద 17,700 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ఆయన ప్రకటించారు.
Recommended Video

బడ్జెట్ లో దళిత బంధు కేటాయింపులతో 11,800 కుటుంబాలకు లబ్ది
తెలంగాణ సీఎం కెసిఆర్ 2021 ఆగస్టు 16వ తేదీన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు నేరుగా 10 లక్షల రూపాయలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులతో తెలంగాణ రాష్ట్రంలో 11,800 కుటుంబాలకు దళిత బంధు పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని దశలవారీగా అమలు చేయనున్నామని పేర్కొన్నారు. దళిత బంధు పథకం అమలు కోసం సీఎం కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిని కూడా నియమించారు.

సామాజిక వివక్ష అంతమొందించటం కోసమే దళిత బంధు
బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీష్ రావు అంబేద్కర్ ఆశయ స్ఫూర్తితో దళిత జాతి ఆర్థిక ప్రగతి లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళిత బంధువని విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, సామాజిక వివక్ష అంతమొందించటం కోసమే ఈ కార్యక్రమం అని పేర్కొన్నారు. దళిత బందు కేవలం పథకం మాత్రమే కాదని దళితుల ఆత్మగౌరవానికి, అభివృద్ధికి, పనికి పనికి వచ్చే ఒక దృక్పథం అని హరీష్ రావు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి ఉపాధి కోసం పది లక్షల రూపాయల ఉచిత ఆర్థిక సహాయం అందించడంలో దళిత బంధు ఒక భాగమని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు .

దేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకం దళిత బంధు
ఇంత పెద్ద మొత్తంలో నగదును ఏ పథకంలోనూ ఇంతవరకు ఇవ్వలేదని, భారీ ఆర్థిక సహాయాన్ని నేరుగా అందిస్తున్న దేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకం గా దళిత బంధు చరిత్రకెక్కింది అని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. 75 ఏళ్ల స్వాతంత్రం సాక్షిగా దళిత జాతి సాధికారత అనేది కలగా మిగిలిపోయిందని పేర్కొన్న హరీష్ రావు, దళితుల సాధికారత కోసం సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకు వచ్చారని చెప్పారు. మూడేళ్లలో రాష్ట్రంలో దళితుల అందరికీ ఈ పథకం కింద లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని పేర్కొన్నారు.

దళిత బంధు ద్వారా ఏ వ్యాపారం అయినా చెయ్యొచ్చు
ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధును అమలు చేయనున్నారని వెల్లడించారు. దళితులకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు దళిత సెక్యూరిటీ ఫండ్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. ఈ పథకం ద్వారా అందిన నగదుతో దళితులు తమకు నచ్చిన వ్యాపారాన్ని చేసుకోవచ్చని, ఈ పథకం కింద లబ్ధి పొందిన లబ్ది దారులు సమూహాలుగా ఏర్పడి భారీ స్థాయిలో కంపెనీలను ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయవచ్చని వెల్లడించారు. ఎలాంటి లింకేజీ లేకుండా నచ్చిన పని చేసుకోవచ్చని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications