telangana budget 2022: నల్లకండువాలతో బీజేపీ ఎమ్మెల్యేల నిరసన; ఆర్ఆర్ఆర్ ఏమన్నారంటే!!
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ బడ్జెట్ సమావేశాలలో తొలిరోజే 2022-23 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీష్ రావు, మండలిలో శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం లేకుండా సభ ప్రారంభం కావడంపై తెలంగాణ బిజెపి ఎమ్మెల్యేలు ఆర్ ఆర్ ఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

గవర్నర్ ప్రసంగం లేకపోవటంపై నల్లకండువాలతో బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై బీజేపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలతో నిరసన వ్యక్తం చేశారు. గన్ పార్క్ వద్ద కు చేరుకున్న బిజెపి ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు నల్ల కండువాలు ధరించి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హుజరాబాద్ నియోజకవర్గం నుంచి బిజెపి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి అసెంబ్లీకి వస్తున్న ఈటల రాజేందర్ తెలంగాణ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై అసెంబ్లీ వేదికగా పోరాటం చేస్తామని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని వెల్లడించారు.

రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న కేసీఆర్ కు ఆ సీట్లో ఉండే అర్హత లేదు: ఈటల
50 ఏళ్ల సాంప్రదాయాన్ని సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించడంపై చర్చించే హక్కు తమకు ఉందని ఆయన పేర్కొన్నారు. శాసనసభ నియమాలను ఉల్లంఘించి కేసీఆర్ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న కేసీఆర్ కు ఆ సీట్లో ఉండే అర్హత లేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విరుచుకుపడ్డారు. గవర్నర్ కే మాట్లాడే హక్కు లేకపోతే, సభలో సభ్యుల పరిస్థితి ఏమిటని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడటానికి సమయం ఇవ్వకపోతే బయట మీ సంగతి తేలుస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ హిట్లర్ ను తలపిస్తున్నాడు: రాజా సింగ్
బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కేసీఆర్ హిట్లర్ ను తలపిస్తున్నారు అంటూ మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం లేకుండా సభ నిర్వహించడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ తీరును గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల గొంతుక వినిపించడానికి సభను వినియోగించుకుంటారని రాజా సింగ్ వెల్లడించారు. మమ్మల్ని సభలో మాట్లాడనివ్వకపోతే నీ గొంతు ఎక్కడ నొక్కాలో మాకు తెలుసంటూ రాజా సింగ్ వ్యాఖ్యానించారు. మీడియా సహకారంతో మా గొంతుకను ప్రజలకు వినిపిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఇది రాబోయే ఎన్నికల బడ్జెట్ : రఘునందన్ రావు
ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ ఈ బడ్జెట్ రాబోయే ఎన్నికల బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. కెసిఆర్ తమ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగాన్ని తీసేయడం కెసిఆర్ రాజ్యాంగమే నంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. కెసిఆర్ కి వ్యతిరేకంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పోరాటం సాగాలని ఆయన పేర్కొన్నారు. బిజెపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ కోస్తుంటే అడ్డుకుంటున్నారని రఘునందన్ రావు మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో ఆర్ఆర్ ఆర్ అడుగుపెడుతున్నామని, కెసిఆర్ కి చుక్కలు చూపించటం ఖాయమని రఘునందన్ రావు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications