తెలంగాణ సీఐడీ డీజీ గోవింద్ సింగ్ కారు బోల్తా: ఆయన భార్య మృతి, మరో ఇద్దరికి గాయాలు
జైసల్మేర్/హైదరాబాద్: రాజస్థాన్ రాష్ట్రంలో తెలంగాణ సీఐడీ డీజీ గోవింద్ సింగ్ కారుకు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడటంతో గోవింద్ సింగ్ సతీమణి షీలా సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డీజీ సహా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డీజీ గోవింద్ సింగ్ తన భార్యతో కలిసి రాజస్థాన్‌లోని మాతేశ్వరి తనోతరాయ్ మాత ఆలయాన్ని సందర్శించేందుకు కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రాంగఢ్ ప్రాంతంలో ఉన్న ఘంటియాలీ మాత ఆలయం సమీపంలోకి రాగానే ఆయన కారు ఒక్కసారిగా బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న డీజీ గోవింద్ భార్య షీలా సింగ్ అక్కడికక్కడే మృతి చెందారు. డీజీ గోవింద్ సింగ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ విజయేందర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిని వారిని జిల్లా కేంద్రంలోని జవహర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు. డీజీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
కాగా, సీఐడీ డీజీ గోవింద్ సింగ్ భార్య మృతి పట్ల తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సహచర సీనియర్ అధికారి గోవింద్ సింగ్ త్వరితగతిన కోలుకోవాలని డీజీపీ ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications