సీఎం కేసీఆర్ కు హ్యాట్రిక్ సాధ్యమేనా - సర్వేలు తేల్చిందేంటి: సై అంటే సై..!!
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండో దఫా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తయింది. మూడో సారి అధికారం దక్కించుకొని హ్యాట్రిక్ కొట్టాలనేది కేసీఆర్ లక్ష్యం. రెండో దఫా నాలుగేళ్ల పాలనలో సక్సెస్ లు - వివాదాలు సమానంగా ఉన్నాయి. గవర్నర్ -కేంద్రంతో పోరాటానికే గత ఏడాది కాల సమయం గడిచిపోయింది. భారీగా పెట్టుబడులతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యత దక్కింది. రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన టీఆర్ఎస్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా ప్రమోషన్ దక్కించుంది. పలు హామీలు ఇంకా అమలు కాలేదు. మొత్తంగా కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలన పూర్తయింది. మరి కొద్ది నెలల్లో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్ కు అధికారం కట్టబెడతారా..ఇప్పటి వరకు సాగిన పాలనకు ఎన్ని మార్కులిస్తారు. సర్వే నివేదికలు ఏం తేల్చాయి...

రెండో విడత పాలనకు నాలుగేళ్లు పూర్తి
తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ కు రాష్ట్ర ప్రజలు 2014లో పట్టం కట్టారు. ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. తొలి విడత పాలనా సమయం పూర్తి కాకముందే 2018లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. 9 నెలలు ముందే ఎన్నికలకు వెళ్లినా.. ప్రజలు కేసీఆర్ వైపే మొగ్గు చూపారు. కాంగ్రెస్ తో ఇతర పార్టీలు జత కట్టినా కేసీఆర్ ను ఓడించలేకపోయాయి. 88 సీట్లతో టీఆర్ఎస్ తిరిగి అధికారం దక్కించుకుంది. 2018 డిసెంబర్ 13న కేసీఆర్ రెండో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నియమితులయ్యారు. 2018 ఎన్నికల సమయం నాటికే తెలంగాణ లో కేసీఆర్ తన రాజకీయంతో బలమైన కాంగ్రెస్ - టీడీపీలను నామమాత్రంగా చేసారు. ఆ దెబ్బ నుంచి ఇప్పటికీ ఆ రెండు పార్టీలు ఇంకా కోలుకోలేదు. అదే సమయంలో తిరిగి రెండో సారి అధికారంలోకి రావటానికి ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో ఇప్పటికీ అమలు కాలేదు. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పైన విమర్శలు వస్తున్నాయి. దళిత బంధు పూర్తి స్థాయిలో అమలు కావాల్సి ఉంది. జిల్లాల్లో మాత్రం పరిపాలనా భవనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు..పారిశ్రామిక పెట్టుబడులు..హైదరాబాద్ లో మౌళిక వసతులు - మెట్రో విస్తరణ ఈ నాలుగేళ్ల పాలనలో సాధించిన విజయాలు

వివాదాలు - ఉప ఎన్నికల ఫలితాలు
ఎస్టీల రిజ్వేషన్లు..ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల అమలులో ఉత్తర్వులు ఇచ్చారు. కానీ, ఆచరణలో వేగం పెంచాల్సి ఉంది. కేంద్రంతో రాజకీయ యుద్దం మొదలైంది. ఏడాది కాలంగా గవర్నర్ - కేంద్రంతో పోరాటానికే అధికార పార్టీ ఎక్కువ సమయం కేటాయిస్తోంది. వరి కొనుగోలు అంశంతో కేంద్రంతో మొదలైన గ్యాప్..ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ పార్టీ ఏర్పాటు వరకు వెళ్లింది. రెండో విడత అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటి ఇచ్చింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. నాగార్జున సాగర్, మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇదే సమయంలో తెలంగాణలో కొత్త పార్టీలు ఆవిర్భవించాయి. ప్రధానితో పెరిగిన గ్యాప్ తో సీఎం కేసీఆర్ మోదీ అధికారిక పర్యటనలకు దూరంగా ఉన్నారు. జాతీయ పార్టీల నేతలు రావటం.. కేసీఆర్ వారి వద్దకు వెళ్లటం ద్వారా ఇప్పుడు జాతీయ స్థాయిలో మోదీ విధానాలను వ్యతిరేకించే వారి జాబితాలో కేసీఆర్ ముందు వరుసలో నిలిచారు. సెప్టెంబర్ 17న తెలంగాణలో కేంద్రం తెలంగాణ విమోచన దినోత్సవం చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం సమైక్యతా దినోత్సవం నిర్వహించింది. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ అమలు కాలేదు. పోడు భూముల వివాదాలు కొనసాగుతున్నాయి. తొలి విడతలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును రెండో విడతలో ప్రారంభించారు.

ఎన్నికల దిశగా- హ్యాట్రిక్ లక్ష్యంగా
బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ ఇప్పుడు ఎన్నికల ఏడాదిలోకి అడుగు పెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖాయమని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పోటీగా ఎదుగుతున్న బీజేపీ పై కేసీఆర్ తన వ్యూహాలతో తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. పదేళ్ల ప్రభుత్వం పైన వ్యతిరేక ఓటు సహజంగానే ఉంటుంది. దీనిని ఒకే పార్టీకి వెళ్లకుండా..ఇతర పార్టీల మధ్య చీలిపోయేలా చిన్న పార్టీలతోనూ కొత్తగా మైండ్ గేమ్ ప్రారంభించారు. ఇదే సమయంలో జాతీయ రాజకీయాలపైన ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్ తెలంగాణలో తిరిగి అధికారంలోకి రావటం ఫైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు మరో 10 నెలల సమయం ఉంది. ఇప్పటి వరకు చేయించిన సర్వేల్లో మాత్రం టీఆర్ఎస్ కు అధికారం పక్కా అని తేలినట్లు పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. కానీ, ఇప్పుడు బీజేపీతో మాత్రం సీఎం కేసీఆర్ సై అంటే సై అంటున్నారు. నో కాంప్రమైజ్ అంటున్నారు. బీజేపీ తెలంగాణలో కొత్త యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి దిగుతుండటంతో పోటీ సై అంటే సై అనే స్థాయిలో ఉంటుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పుంజుకుంటుందా.. బీజేపీ ఆశిస్తున్న స్థాయిలో ప్రజామద్దతు దక్కించుకోగలదా.. టీఆర్ఎస్ పదేళ్ల పాలన తరువాత కూడా ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొని హ్యాట్రిక్ సాధించగలదా అనేది ఇప్పుడు బిగ్ డిబేట్ గా మారుతోంది. దీంతో, రానున్న రోజుల్లో తెలంగాణ కేంద్రంగా కీలక పరిణాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications