మోడీ మెచ్చుకోలు, 3వ అతిపెద్ద మానవ ప్రయత్నం: కేసీఆర్
హైదరాబాద్: 70వ స్వాతంత్ర వేడుకలు హైదరాబాదులోని గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కోట పైన జాతీయ జెండాను ఆవిష్కరించారు. వందనం చేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు పరేడ్ మైదానంలో సైనికుల స్మారక స్థూపం వద్ద కేసీఆర్ నివాళులు అర్పించారు.
జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. విభజన అనంతరం మనం బాలారిష్టాలు దాటామని, పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంటున్నామని చెప్పారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
గజ్వెల్‌లో నల్లాల ద్వారా నీరు అందిస్తున్నాం. ప్రజలందరికీ తాగునీరు అందించడం లక్ష్యం.
రాష్ట్రవ్యాప్తంగా 40 డయాలసిస్ సెంటర్లు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీఎస్ ఐపాస్ సత్ఫలితాలిస్తోంది. లక్ష మందికి పైగా ఉద్యోగ అవకాశాలు దక్కాయి. ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన.
ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల పలు పథకాలకు శంకుస్థాపన చేశారు. వాటిని త్వరగా పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రం ఏర్పడక ముందు జాతీయ రహదారి తక్కువగా ఉంది. ఇప్పుడు కేంద్రం నుంచి ఎక్కువ మంజూరు చేయించుకున్నాం.నిజమైన అభివృద్ధి అంటే పేద ప్రజలకు సంతోషంతో బతకడం. వారి కోసం నిధులు కేటాయించాం. పేద బ్రాహ్మణులకు బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించాం.
సాగునీటి ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తి చేస్తాం. రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. రూ.420 కోట్లతో వ్యవసాయ పనిముట్లు, పరికరాలు. చిన్న, సన్నకారు రైతులకు వంద శాతం సబ్సిడీ. గోడౌన్ల నిర్మాణానికి రూ.1024 ఖర్చు పెట్టాం. సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ అందిస్తున్నాం. మైక్రో ఇరిగేషన్‌కు అధిక ప్రాధాన్యం.
బాలారిష్టాలు దాటుకుంటూ అభివృద్ధి వైపు పయనిస్తున్నాం. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సన్నిహితంగా ఉంటాం. కర్నాటకతో సంబంధాలు బలపడ్డాయి.తెలంగాణ ప్రభుత్వ తీరును ప్రధాని మోడీ ప్రశంసించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ రీ ఓపెనింగ్ మనం సాధించిన విజయం. ఇంటింటికి తాగునీరు
కళ్యాణ లక్ష్మిని బీసీలకు, ఈబీసీలకు వర్తింప చేస్తున్నాం. జనాభా ప్రాతిపదికన మైనార్టీలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు.
మిషన్ కాకతీయతో చెరువుల్లో జలకళ.వారం రోజుల్లో మరో ఇరవై గురు కులాలు. ఈ ఏడాది నుంచి యూనివర్సిటీలు, కాలేజీల్లోను సన్న బియ్యం.హుస్సేన్ సాగర్ వద్ద 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం. దసరా పండుక నుంచి కొత్త జిల్లాలు పని చేస్తాయి.పాలమూరు జిల్లాలో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. విద్యుత్ సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించాం. ఇప్పుడు మిగులు విద్యుత్ సాధిస్తున్నాం.
తెలంగాణ పోలీసుల పరిధి ఎంతో పెరిగింది. జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసులకు ఎక్కువ అవార్డులు వచ్చాయి. ఇది మనకు గర్వకారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి శౌర్యచక్ర... నల్గొండ జిల్లాకు చెందిన పోలీసులు శ్రీనివాసులుకు వచ్చింది. మొత్తం మన పోలీసులు 32 జాతీయ అవార్డులు సాధించి, అగ్ర స్థానంలో నిలిచారు.
75వేల కోట్లకు పైగా సాఫ్టువేర్ ఎగుమతులు. హైదరాబాద్ వేదికగా 2018లో వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ.భావి తరాల కోసమే హరితహారం చేపట్టాం. 46 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. హరితహారం మూడో అతిపెద్ద మానవ ప్రయత్నం. హరితహారానికి విశేష స్పందన వస్తోంది.

దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాం
గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. కేసీఆర్ మాట్లాడుతూ... ఇదే గోల్కొండ కోట నుంచి మొదటిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన నాడు ఈ రాష్ట్రం రెండున్నర నెలల పసిబిడ్డ. ఒక్కొక్కటిగా బాలారిష్టాలను దాటుకుంటూ స్థిరమైన పాలన అందిస్తూ రెండేళ్ల తక్కువ సమయంలోనే అభివృద్ధిలో, సంక్షేమంలో మనం సాధించిన ఫలితాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు
నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మొదటి రోజే మన రాష్ట్రం ఇరుగు పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక వైఖరి అవలంభిస్తోందని చాలా స్పష్టంగా ప్రకటించాను. ఆ స్ఫూర్తికి అనుగుణంగానే ఆయా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలిచ్చాయి.

విద్యుత్ వస్తోంది
నీటి పారుదల, విద్యుత్ రంగాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో సయోధ్యను సాధించుకోగలిగాం. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఒప్పందం కుదిరింది. మరో నాలుగు నెలల్లో రాష్ట్రానికి విద్యుత్ అందుతుంది.

గత పాలకుల వల్లే
గోదావరి ప్రాజెక్టుల నిర్మాణం గత ప్రభుత్వాల విధానం వల్ల వివాదాల్లో చిక్కుకొని ముందుకు సాగలేదు. మహారాష్ట్రతో వివాదాలు పరిష్కరించుకునే విషయంలో గత పాలకులు సరైన విధానాన్ని అవలంభించకపోగా, మరింత జఠిలం చేశారు. ఈ పరిస్థితిని అధిగమించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రతో జరిపిన చర్చలు ఫలించాయి. రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఈ నెల 23న ముంబైలో చారిత్రక ఒప్పందం జరగనుంది.

కర్నాటకతో..
కర్ణాటక ప్రభుత్వంతో కూడా స్నేహ సంబంధాలు బలపడ్డాయి. దీని వల్ల మహబూబ్‌నగర్‌కు నీరందించే ఆర్డీఎస్ పనులు వేగవంతం అయ్యాయి. పోయిన ఎండకాలంలో తాగునీటి కోసం పాలమూరు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి గతంలో ఎన్నడూ లేని విధంగా జూరాలకు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయించుకున్నాం.

సమాఖ్య స్ఫూర్తి
కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో మన రాష్ట్రం సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తోంది. కేంద్రంలో సఖ్యంగా వ్యవహరిస్తోంది. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ గజ్వేల్ వేదికగా ఇంటింటికీ నల్లా నీరు అందించే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మోడీ కితాబు
సాగు, తాగునీటి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను, నిబద్ధతను మోడీ ప్రశంసించారు. జాతీయ రహదారుల విషయంలో మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయాం. ఈ విషయంలో కూడా కేంద్రం సానుకూలంగా స్పందించింది.

జాతీయ రహదారి
రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో 2,592 కిలోమీటర్ల జాతీయ రహదారి మాత్రమే ఉండేది. ఈ రెండేళ్లలో కొత్తగా 1951 కిలోమీటర్ల జాతీయ రహదారిని మంజూరు చేయించుకోగలిగాం. దీంతో తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు మొత్తం 4,590 కిలోమీటర్లకు చేరింది.

సత్సంబంధాలు
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమించాలి. అందుకోసం అటు కేంద్రంతోను, ఇటు పొరుగు రాష్ట్రాలతోను సత్సంబంధాలు కొనసాగిస్తాం. నిజమైన అభివృద్ధి అంటే పేద ప్రజలకు భరోసా ఇవ్వడం, భద్రత ఇవ్వడం.

పేదలకు అండ
రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ. 30 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తూ 35 పథకాలను అమలు చేస్తున్న విషయం మీకందరికి తెలుసు. సంక్షేమ రంగంలో తెలంగాణ దేశంలో నంబర్ వన్‌గా నిలిచిందని సంతోషకరంగా తెలియజేస్తున్నాను. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మీ పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచే బీసీ, ఈబీసీలకు వర్తింపజేస్తున్నాం.

పేదలకు అండ
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం ఈ విద్యా సంవత్సరం నుంచే 250 గురుకుల విద్యాలయాలను కొత్తగా మంజూరు చేశాం. ఇప్పటికే 230 గురుకులాలు ప్రారంభమై విద్యా బోధన జరుగుతున్నది. మరో 20 గురుకులాలు వారం రోజుల్లో ప్రారంభమవుతాయి. బీసీ విద్యార్థుల కోసం కూడా త్వరలోనే 50 రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేస్తాం.

ఉచిత విద్య
తెలంగాణ రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అందించాలనే బృహత్ సంకల్పానికి బలహీనవర్గాల గురుకులాలతో బీజం పడినందుకు సంతోషిస్తున్నాను. ఇప్పటికే 40 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులకు కూడా సన్నబియ్యంతో భోజనం పెడతాం.

రిజర్వేషన్లు
తెలంగాణ రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఎస్టీలు, మైనార్టీలు పేదరికంలో ఉన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎస్టీలు, మైనార్టీలు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పొందలేదు. ఎస్టీలు, మైనార్టీల స్థితిగతులు అధ్యయనం చేయడానికి నియమించిన చెల్లప్ప, సుధీర్ కమిషన్లు ఇటీవలే నివేదికలు అందించాయి. త్వరలోనే ఎస్టీలు, మైనార్టీల జనాభా దామాషాను అనుసరించి రిజర్వేషన్లు కల్పిస్తామని, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు పెంచుతాం. పేద బ్రహ్మణుల కోసం బడ్జెట్‌లో రూ. 100 కోట్లు కేటాయించాం. వారి అభివృద్ధి కోసం తగిన పథకాలు త్వరలోనే రూపొందించబడుతాయి.

అంబేడ్కర్ విగ్రహం
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా హుస్సేన్ సాగర్ తీరంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకోబోతున్నాం. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి త్యాగాన్ని చరిత్రలో నిలిపే విధంగా లుంబినీ పార్క్‌లో తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నన్ని ఘనంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పనులు ప్రారంభించింది.. అని కేసీఆర్ చెప్పారు.
-
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications