ఏపీ జలదోపిడీని తెలంగాణా అడ్డుకోవటం లేదు.. కేసీఆర్ తీరుతో అన్యాయం : ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్
ఏపీ తెలంగాణా రాష్ట్రాల మధ్య జల వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. జలదోపిడీ చేస్తున్నారంటూ ఏపీపై తెలంగాణా , తెలంగాణా ప్రభుత్వంపై ఏపీ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ ఎంపీ, మాజీ టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న జల దోపిడీపై పార్లమెంట్లో ప్రస్తావిస్తాం అని ఆయన పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన నీటి దోపిడీతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన జల దోపిడీనే ఎక్కువ అని ఆయన ఆరోపించారు.ఇంతా జరుగుతున్నా తెలంగాణ సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పోతిరెడ్డిపాడు నుంచి 4 నుంచి 8 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ ప్రయత్నిస్తుంటే సీఎం కేసీఆర్ అడ్డుకోకుండా మౌనంగా ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

కెసిఆర్ వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని విమర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంతకాలం తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం పొందడానికి తన వంతు కృషి చేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications