సుప్రీం చీఫ్ జస్టిస్‌తో కేసీఆర్ భేటీ: హైకోర్టు విభజనపై చర్చ
న్యూఢిల్లీ: రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తిగా ఈ నెల 3వ తేదీన బాధ్యతలు తీసుకున్న జస్టిస్ టీఎస్ ఠాకూర్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య హైకోర్టు విభజనపై చర్చ జరిగినట్లు సమాచారం.

అయితే ఇది మర్యాదపూర్వక భేటీ తప్ప ఈ సమావేశానికి మరే ప్రాధాన్యం లేదని టీఆర్‌ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. అంతకుముందు మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కూతురి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అనంతరం బయటకు వస్తుండగా ఏపీ సీఎం చంద్రబాబు ఎదురయ్యారు. వెంటనే ఆయనను పలుకరించి కరచాలనం చేశారు. ఇద్దరు సీఎంలు కొన్ని సెకన్ల పాటు మాత్రమే పలకరించుకున్నా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. కేసీఆర్ వెంట ఉన్న టీఆర్ఎస్ ఎంపీలతో పాటు తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి కూడా చంద్రబాబును పలకరించారు.
ఢిల్లీలోని తన నివాసంలో ఉన్న కేసీఆర్‌తో ఎంపీలు కే కేశవరావు, జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, డాక్టర్ నర్సయ్యగౌడ్, సీతారాంనాయక్, బీబీ పాటిల్, జీ నగేశ్, పసునూరి దయాకర్, ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులతో భేటీ అయ్యారు.
కృష్ణా జలాల వివాదంపై కేంద్ర జలవనరలు శాఖ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. దీనిపై నేరుగా ఆయన ప్రధాని మోడీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది.
కృష్ణా జలాల వివాదంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్-1 తీర్పుపై సుప్రీం కోర్టులో స్టే కొనసాగుతున్నా కేంద్రం దాన్ని పరిగణనలోకి తీసుకోకపోగా కృష్ణాజలాలు, కొత్త ట్రిబ్యునల్ వివాదాలు తెలుగు రాష్ట్రాలకు పరిమితమని కేంద్రం కోర్టుకు తెలపడం వివాదాస్పదమవుతోంది.
ఈ క్రమంలో సాగునీటి సలహాదారు విద్యాసాగర్‌రావు, అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు, న్యాయవాది రవీందర్‌రావులు కూడా కేసీఆర్‌ను కలుసుకుని సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జరుగుతున్న వాదనలను, కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని తెలియజేశారు. గురువారం ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.












Click it and Unblock the Notifications