అంతా రెడీ... KCR గేమ్ ఆడేది అప్పటి నుంచే!!
తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చిన ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భవిష్యత్తులో పోషించబోయే పాత్ర కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. భారతీయ జనతాపార్టీ విధానాన్ని వ్యతిరేకిస్తూ నరేంద్రమోడీ, అమిత్ షాకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా ప్రకటించినట్లు ఆయన బహిరంగంగానే చెప్పారు.

పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయం!
ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరు పోరాటాన్ని ప్రారంభించకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారని కేసీఆర్ అంటున్నారు. ముందుగా ప్రాంతీయ పార్టీలన్నింటితో కలిసి ఒక వేదిక ఏర్పాటు చేద్దామనుకున్నప్పటికీ జాతీయస్థాయిలో పార్టీయే మంచిదనే అభిప్రాయానికి వచ్చి బీఆర్ఎస్ ను ప్రకటించారు. అనుకున్నట్లుగా విజయ దశమికి పార్టీని ప్రకటించారు. ప్రగతి భవన్ లో పార్టీ నేతలతో చర్చించిన తర్వాత డిసెంబరు నుంచి పోరాటాన్ని ఉధృతస్థాయిలో చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

డిసెంబరు 9న ఢిల్లీలో బహిరంగసభ
డిసెంబరు 9వ తేదీన దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. జాతీయ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు పార్టీ ప్రతినిధులను డిసెంబరు ఆరోతేదీన ఢిల్లీ పంపనున్నారు. జాతీయ రాజకీయాల్లో ఎటువంటి పాత్ర పోషించాలి? ఎక్కడ ఎలా వ్యవహరించాలి? అనే విషయాలపై ఆయన పూర్తిస్థాయి ప్రణాళిక రూపొందించుకున్నారు. మీడియాలో ప్రచారం కోసం పక్కా ప్రణాలికలు సిద్ధం చేశారు. ఈలోగా పార్టీకి సాధ్యమైనంత వేగంగా హైప్ తెచ్చే బాధ్యతలను ఇతరులకు అప్పగించారు.

ఢిల్లీ పెద్దలకు గురిపెట్టి రాష్ట్ర రాజకీయం?
డిసెంబరు 9న జరిగే బహిరంగసభలో పూర్తి విధివిధానాలను ప్రకటించబోతున్నారు. ఢిల్లీలో ఇప్పటికే కార్యాలయ నిర్మాణం పూర్తయింది. దానిని కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నారు. దీన్ని కేంద్రంగా చేసుకొని జాతీయ రాజకీయాలు చేయబోతున్నారు. డిసెంబరు నుంచి లెక్కేస్తే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కేవలం 10 నెలల సమయమే ఉంటుంది. పూర్తిగా జాతీయ రాజకీయాలపైనే దృష్టిసారిస్తే రాష్ట్రంలో పట్టుకోల్పోయే ప్రమాదం తలెత్తుతుందని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ పెద్దలకు గురిపెట్టి తెలంగాణ ప్రజల మద్దతు కోరాలనే వ్యూహాన్ని కేసీఆర్ అవలంబించబోతున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications