కెసిఆర్‌కు శాన్‌ఫ్రాన్సిస్కో ఆహ్వానం: మళ్లీ ఢిల్లీ వెళ్తా, హోదాని వదలను.. బాబు
హైదరాబాద్/అనంతపురం: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కాలిఫోర్నియా గవర్నర్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. వచ్చే జూన్ నెలలో శాన్‌ఫ్రాన్సిస్కోలో సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానంలో పేర్కొన్నారు.
సబ్ కాంటినెంటన్ క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ భేటీలో సీఎం కేసీఆర్ పాల్గొనాలని కోరారు. ఆహ్వానపత్రాన్ని మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు కాలిఫోర్నియా అసిస్టెంట్ సెక్రటరీ అందించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని కాలిఫోర్నియా అధికారులకు మంత్రి వివరించారు. టీ హబ్ భాగస్వామ్యానికి కృషి చేస్తామని కాలిఫోర్నియా అధికారులు హామి ఇచ్చారు.

ఢిల్లీకి ఎన్నోసార్లు తిరిగా.. మళ్లీ మళ్లీ తిరుగుతా: చంద్రబాబు
విభజన సమస్యలను కేంద్రమే పరిష్కరించాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో అన్నారు. విభజన సమస్యల పరిష్కారం కోసం తాను ఇప్పటికే చాలాసార్లు ఢిల్లీ తిరిగానని, మళ్లీ మళ్లీ వెళ్తానని వ్యాఖ్యానించారు.
విభజన చట్టంలో ఉన్న హామీలన్నింటిని కేంద్రం వెంటనే నెరవేర్చాలన్నారు. దక్షిణాది జిల్లా రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ ఎదిగేందుకు కేంద్రం నిధులు ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురవుతున్నా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు.
ప్రత్యేక హోదా పైన ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. నేను దేనినీ వదిలి పెట్టనని, కేంద్రం నెరవేర్చాల్సిన హామీలను రాబట్టుకుంటామని చెప్పారు. పోలవరాన్ని 2019 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కేంద్రం సహకరించి సకాలంలో నిధులు విడుదల చేయాలన్నారు.
రాష్ట్రంలో భూగర్భ జలాలు అట్టడుగుకు చేరుకున్నాయన్నారు. వాటిని పెంచే లక్ష్యంతోనే నీరు-చెట్టు, పంట సంజీవని వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కడప జిల్లాను ఉద్యాన హబ్‌గా, అనంతపురం జిల్లాలో కరువును పారద్రోలి చరిత్రను తిరగరాస్తామన్నారు. భూగర్భ జలాలు మూడు మీటర్లు వచ్చే వరకు నేను వదలనని వ్యాఖ్యానించారు. లక్ష ఫాం పాండులు నిర్మిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications