కేసీఆర్ హ్యాట్రిక్ కు హ్యాండ్ బ్రేక్ ?, ఏం చెయ్యాలో తెలీక టెన్షన్, ఓటరు నాడికి క్లైమాక్స్, ఆ రోజు !
ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నేటితో ముగియనున్నాయి, ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పోలింగ్ ముగిసింది, తెలంగాణలో నేడు ఓటింగ్ జరుగుతోంది. గురువారం ఉదయం తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఈసారి కాంగ్రెస్ సవాల్ విసురుతోంది. తెలంగాణలో బీజేపీ కూడా భారీగా ఎన్నికల ప్రచారం చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నాయకులు, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ తో పాటు కర్ణాటకలో తెలుగు బాష మాట్లాడే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కట్టకట్టుకుని తెలంగాణ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీతో జతకట్టిన బీజేపీ నాయకులు ఎలాగైనా తమ సత్తా చాటుకోవాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు పలు నియోజక వర్గాల్లో గట్టిపోటి ఇస్తున్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వానేనా అని పోటీ ఉంది. ఈ రెండు పార్టీలతో ఢీకొట్టడానికి బీజేపీ కూడా అనేక ప్రయత్నాలు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వరుసగా మూడోసారి విజయం సాధించేందుకు అనేక పథకాలు ప్రకటించారు. మహిళలు, విద్యార్థులు, రైతులకు బీఆర్ఎస్ పార్టీ భారీ ఆఫర్లు ప్రకటించింది. బీఆర్ఎస్ కు పోటీగా కాంగ్రెస్ పార్టీ ఆరు ఉచిత హామీలను ప్రకటించింది. అయితే కేసీఆర్ హ్యాట్రిక్ కు కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ బ్రేక్ వెయ్యడానికి ఇప్పటికే శక్తివంచనలేకుండా పని చేసిందని స్పష్టంగా వెలుగు చూసింది.

2023లోనే జరిగిన కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడానికి కారణం అయిన ఉచిత హామీలు ఇప్పుడు తెలంగాణలో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ పార్టీకి ఆత్మవిశ్వాసం పెరిగింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ హామీ పథకాలు తెలంగాణ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు.

కర్ణాటకలో కొన్ని నెలల క్రితం వరకు అధికారంలో ఉన్న బీజేపీ ఓడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలు ప్రధాన కారణం అని అందరికి తెలిసిందే. కర్ణాటకలో ప్రకటించిన ఉచితహామీలు తెలంగాణలో ప్రకటించడంతో ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొత్త ఉత్సాహంతో ఉన్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి ప్రస్తుతం కేరాఫ్ అడ్రస్ లేకుండా పోయింది.
బీజేపీ బలంగా ఉన్న కర్ణాటక రాష్ట్రంలో సీనియర్లను, సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కొత్తవాళ్లకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చి ప్రయోగాలు చెయ్యడానికి ప్రయత్నించిన బీజేపీ హైకమాండ్ అధికారంలో ఉండే ఒక్క రాష్ట్రంలో కూడా అధికారాన్ని కోల్పోయింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు దక్షిణాదిలో బీజేపీ కార్యకర్తల్లో నైతిక స్థైర్యాన్ని పెంపొందించేలా మంచి పనితీరును కనబరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా బండి సంజయ్‌ను తప్పించి ఆయన స్థానంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని నియమించడం ఆ పార్టీలో అసంతృప్తిని కలిగించింది. అయితే ఆలస్యంగా ఆ విషయం గుర్తించిన బీజేపీ హైకమాండ్ తెలంగాణ విషయంలో అలర్ట్ అయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వానేనా అంటూ పోటీపడ్డాయి.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ చివరిగా ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలలో ఇప్పటికే ఓటింగ్ ముగిసింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్‌లుగా బావిస్తున్నారు. డిసెంబర్ 3వ తేదీన ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ రోజు కింగ్ మేకర్ ఎవరు అనే విషం స్పష్టం తెలిసిపోంది.












Click it and Unblock the Notifications