CM Revanth Davos Tour: సీఎం రేవంత్ దావోస్ టూర్... తొలి ఒప్పందం బిగ్ సక్సెస్..!
ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోల్ పర్యటనలో బిజీగా ఉన్నారు. పర్యటనలో భాగంగా సీఎం రేవంత్, ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ రైజింగ్ విభాగం సభ్యుల బృందం.. యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈవోతో షూ మాకర్ తో పలు దఫాలు చర్చలు జరిపింది. ఆ చర్చలు విజయవంతం అయ్యాయి.
పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం వల్ల కంపెనీకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో సీఎం రేవంత్ స్వయంగా యూనిలివర్ సీఈఓ షూ మాకర్, చీఫ్ సప్లయి చైన్ ఆఫీసర్ విలియమ్ ఉయిజన్ లకు వివరించారు. తెలంగాణ ల్యాండ్ లాక్డ్ స్టేట్, పెట్టుబడులకు అనుకూలమైన సరైన వాతావరణ పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ఐటీ విజన్- 2050 పాలసీలో భాగంగా యూనిలివర్ కంపెనీకు పూర్తి మద్దతు ఇస్తామని, పెట్టుబడులు, వాణిజ్యాన్ని సులభతరం చేస్తామని వివరించారు.

సౌత్ ఇండియాకు తెలంగాణ రాష్ట్రం వారధిగా, గేట్ వే గా ఉంటోందని తెలిపారు. తమ ప్రభుత్వం యూనిలివర్ కంపెనీకు పూర్తిగా సపోర్ట్ చేస్తుందని.. యూనిలివర్ కంపెనీ ఉత్పత్తులకు తెలంగాణలో మంచి గిరాకీ ఉందని తెలిపారు. అన్ని రకాలుగా సహకరిస్తుందని రేవంత్ టీం వారికి వివరించారు. చర్చల అనంతరం రాష్ట్రంలో రెండు యూనిట్ లను నెలకొల్పేందుకు యూనిలివర్ సంస్థ అంగీకరించింది.
కామారెడ్డి జిల్లాలో ప్లాంట్..
చర్చల్లో భాగంగా రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ అంగీకరించింది. అంతేకాక రాష్ట్రంలో బాటిల్ క్యాప్ ల తయారీ యూనిట్ నూ నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన బ్రాండ్‌లలో ఒకటిగా యూనిలివర్‌కు పేరున్న విషయం తెలిసిందే.

యూనిలివర్ కంపెనీతో చర్చల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చర్చలు ఫలించడం శుభపరిణామం అని అన్నారు. ఈ ఒప్పందం వల్ల రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని స్పష్టం చేశారు. యూనిలివర్ కంపెనీ రాష్ట్రంలో అభివృద్ధి చెందేందుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రైజింగ్ విభాగం సభ్యులతో పాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్, ప్రిన్సిపల్ సెక్రటరీ వీ. శేషాద్రి, సీఎంఓ సభ్యులు ఈ. విష్ణు వర్ధన్ రెడ్డి, స్పెషల్ సెక్రటరీ బీ. అజిత్ రెడ్డి పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications