రాహుల్ గాంధీతో తెలంగాణా కాంగ్రెస్ నేతల భేటీ: ఆ నివేదికలతో హాజరుకానున్న వ్యూహకర్త సునీల్
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలలో చావు దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ఇప్పటి నుండే దృష్టిసారిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా పట్టు సాధించాలని ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సారథ్యంలో దూకుడు చూపిస్తుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో సీఎం కేసీఆర్ పై, తెలంగాణ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలను టార్గెట్ చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.

ఏప్రిల్ 4 న తెలంగాణా నేతలతో రాహుల్ గాంధీ భేటీ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించటానికి, భవిష్యత్తు ఎన్నికల్లో కాంగ్రెస్కు పునర్ వైభవాన్ని తీసుకురావడానికి నిర్ణయించిన రాహుల్ గాంధీ ఈ మేరకు తెలంగాణ రాష్ట్రం పై ఫోకస్ పెట్టారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంటుందని భావించిన రాహుల్ గాంధీ తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటికే ఓ మారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశమైన రాహుల్ గాంధీ 4వ తేదీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో మరోమారు సమావేశం నిర్వహించనున్నారు.

పార్టీ ముఖ్యనాయకులతో మరోమారు రాహుల్ గాంధీ భేటీ
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన కాంగ్రెస్ పార్టీ, కొన్ని ప్రాంతాలలో ఊహించిన దానికంటే ఎక్కువగా సభ్యత్వ నమోదు చేయడం పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఇక సీనియర్ల అలకలూ, అంతర్గత కుమ్ములాటలు మాట అటుంచి పార్టీని ముందుకు నడిపించటానికి ప్రయత్నం చేస్తున్న రాహుల్ గాంధీ నాలుగవ తేదీన తెలంగాణ నేతలతో మరోమారు భేటీ కానున్నారు. రాహుల్ గాంధీతో జరిగే సమావేశానికి మాజీ మంత్రులను కూడా పిలవాలని ఏఐసిసి నిర్ణయించింది. పిఏసి సభ్యులు, మాజీ మంత్రులతో రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. దీంతో ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

సమావేశానికి ఆ నివేదికలతో హాజరు కానున్న రాజకీయ వ్యూహకర్త సునీల్...
ఇక ఈ సమావేశానికి రాజకీయ వ్యూహకర్త సునీల్ హాజరు కానుండటం కూడా ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నియోజకవర్గాలలో రాజకీయ వ్యూహకర్త సునీల్ కొంతవరకు వర్క్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ క్షేత్రస్థాయి నివేదికలతో సునీల్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. సునీల్ ఇచ్చే రిపోర్ట్ ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకుని భవిష్యత్ కార్యాచరణపై కూడా నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

భవిష్యత్ కార్యాచరణకు రూపకల్పన చెయ్యనున్న టీ కాంగ్రెస్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డికి మద్దతుగా సునీల్ మరియు పార్టీ నేతలంతా పూర్తిగా సహకారం అందించాలని, రాజకీయ వ్యూహకర్త సునీల్ సూచించిన వ్యూహం ప్రకారం ఎన్నికల ప్రచారంలోకి దిగాలని రాహుల్ గాంధీ సూచించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాటాలు చేయాల్సిన పరిస్థితులపై కూడా రాహుల్ గాంధీతో భేటీలో చర్చించనున్నారు. బీజేపీ సర్కారుపై, టీఆర్ఎస్ ప్రభుత్వం పై కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన ఉద్యమాలకు కూడా కార్యాచరణ రూపొందించనున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications