రేపే తుది ఫలితాలు: రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు.. తొలి ట్రెండ్ తెలిసేది అప్పుడే!!
తెలంగాణలో కట్టుదిట్టమైన భద్రత నడుమ రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు. ఎన్నికల కౌంటింగ్ కు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో 14 హైదరాబాద్ జిల్లాలో ఉండగా, 4 రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేశారు. జిల్లాలలో 31 కౌంటింగ్ కేంద్రాలను జిల్లా హెడ్ క్వార్టర్ లలో ఏర్పాటు చేశారు.
అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, దాదాపు 40 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసులను మోహరించారు. తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీకి 119 మంది సభ్యులను ఎన్నుకునేందుకు 3 కోట్ల 26 లక్షల మంది ఓటర్లలో మొత్తం 71.34 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అత్యధికంగా నల్గొండ జిల్లాలోని మునుగోడులో 91.89 శాతం పోలింగ్ నమోదు కాగా, హైదరాబాద్ జిల్లా యాకుత్‌పురలో అత్యల్పంగా 39.64 శాతం పోలింగ్ నమోదైంది. 221 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్‌తో సహా మొత్తం 2290 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ లు రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఆరుగురు ఎంపీలు ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తుండగా, 100 మందికి పైగా సిట్టింగ్ సభ్యులు అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీఆర్‌ఎస్ మొత్తం 119 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయగా, బీజేపీ తన మిత్రపక్షమైన జనసేనకు 8 సీట్లు కేటాయించి ఎన్నికల బరిలోకి దిగింది.
కాంగ్రెస్ సీపీఐకి ఒక సీటు ఇచ్చింది. సీపీఎం 19 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయగా, ఎంఐఎం 9 స్థానాల్లో పోటీ చేసింది. బీఎస్పీ 106 స్థానాల్లో పోటీ చేసింది. మీడియా హౌస్‌లతో సహా అనేక సంస్థల ఎగ్జిట్ పోల్‌ల అంచనాలు ఈ సారి ఎన్నిక టఫ్ ఫైట్ అని అర్ధం అయ్యేలా చేశాయి. ఇదిలా ఉండగా, రేపు ఉదయం 10-10.30 గంటలకు మొదటి ట్రెండ్ వెలువడుతుందని ఎన్నికల అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications