మందబాబులకు గట్టి షాకిచ్చిన తెలంగాణ ప్రభుత్వం
మందుబాబులకు ఎక్సైజ్ శాఖ అధికారులు గట్టి షాకిచ్చారు. అయితే ఇది అందరికి కాదు, కొందరికే అని అధికారులు తేల్చేశారు. తెలంగాణలో ఇటీవల ప్రైవేట్ పార్టీల కల్చర్ బాగా పెరిగింది. దీంతో విచ్చలవిడిగా మద్యం అందుబాటులోకి వస్తోంది. ఇటీవల ఎక్సైజ్ శాఖ చేసిన దాడుల్లో అనుమతి లేకుండ మద్యం సరఫరా చేస్తున్నారని తేలింది. అయితే ప్రైవేట్ పార్టీలకు ఎటువంటి అనుమతులు ఉండటం లేదు.
ఈ విషయాన్ని గమనించిన ఎక్సైజ్ శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, నివాసాల వద్ద జరిగే ప్రైవేట్ పార్టీలలో భారీ మొత్తంలో మద్యం సరఫరా చేసేందుకు ప్రజలు తప్పనిసరిగా లైసెన్స్‌లు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్ణయించారు. ప్రైవేట్ ఫంక్షన్లలో మద్యం సేవించాలంటే ముందస్తు అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని ఈవెంట్ నిర్వాహకులను ఎక్సైజ్ శాఖ కోరింది.

ప్రైవేట్ పార్టీలకు నిర్వాహకులు దరఖాస్తు చేసుకున్న తర్వాత పార్టీలు జరిగే ప్రాంగణాన్ని లేదా వేదికను పరిశీలించిన తర్వాత అనుమతి ఇస్తామని ఎక్సైజ్ శాఖ అధికారి తెలిపారు. లైసెన్సు పొందిన సంస్థలలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నారా లేదా నిల్వ ఉంచుతున్నారా అనే విషయాలపై ప్రత్యేక నిఘా పెడతామని అధికారులు పేర్కొన్నారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం, 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిని మైనర్లుగా పరిగణిస్తారని, అలాంటి వారికి పార్టీల్లో ఎంట్రీ లేదని అధికారులు స్పష్టం చేశారు.
దరఖాస్తుకు సంబంధించిన రుసుము వివరాలను సైతం ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఫ్యామిలీ పార్టీలకు రోజుకు రూ. 10,000 రుసుము చెల్లించాలి.స్టార్ హోటళ్లలో నిర్వహిస్తే అంతకంటే ఎక్కువ రుసుము చెల్లించాలి. ఈవెంట్ స్పోర్ట్స్, కమర్షియల్ , ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీకి సంబంధించినది అయితే, టిక్కెట్‌ల సంఖ్యను బట్టి ఛార్జీలు ఉంటాయని తెలిపారు. పార్టీలు చేసుకునే సమయాన్ని రెండు భాగాలుగా విభజించారు.
ఉదయం 11 నుండి సాయంత్రం 4 వరకు లేదా సాయంత్రం 7 నుండి 11 గంటల వరకు. ఈవెంట్ పర్మిట్‌లను దరఖాస్తు చేయడం , పొందడం మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. అనుమతుల కోసం, https://excise.telangana.gov.in/ సందర్శించండి , అవసరమైన పత్రాలు , చెల్లింపులను అప్‌లోడ్ చేయండి. అనుమతి సాధారణంగా 48 గంటల్లో జారీ చేయబడుతుంది. అయితే ఇంట్లో జరిగే పార్టీలకు మద్యం తక్కువ పరిమాణంలో అంటే ఆరు బాటిళ్ల కంటే తక్కువకు, మద్యం అనుమతి అవసరం లేదని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications