తెలంగాణలో స్కూళ్లు, కళాశాలలకు సెలవు..!!
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. హైదరాబాద్ మొదలుకుని అన్ని జిల్లాల్లోనూ ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా- వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాల వల్ల అటు గోదావరి నది వరదనీటితో పోటెత్తుతోంది.
మరో రెండు రోజుల పాటు ఇవే పరిస్థితులు ఉంటాయని, మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వివరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాల ధాటికి అతలాకుతలం అయ్యాయి. మున్ముందు మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న అతిభారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలన్నింటికీ సెలవును ప్రకటించింది ప్రభుత్వం. జూలై 26, 27 తేదీల్లో- అంటే బుధ, గురు వారాల్లో రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ సహా ఎనిమిది జిల్లాలకు ఆరేంజ్ అలర్ట్ సైతం జారీ చేసింది.
పెద్దపల్లి, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, యాదాద్రి, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. దీనితో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతవాసులను అప్రమత్తం చేసింది. నదీ పరీవాహక ప్రాంత ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.












Click it and Unblock the Notifications