క్లౌడ్ బరస్ట్ కుట్ర కామెంట్స్: కేసీఆర్‌కు తమిళిసై కౌంటర్
హైదరాబాద్: గోదావరికి సంభవించిన వరదల వెనుక క్లౌడ్ బరస్ట్ కుట్ర దాగి ఉందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోన్నాయి. పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులు ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు. కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తోన్నారు. వరద సహాయక చర్యల్లో విఫలం కావడం వల్లే కేసీఆర్ ఈ కుట్ర ఆరోపణలను తెర మీదికి తెచ్చారంటూ మండిపడుతోన్నారు.
ఇప్పుడు తాజాగా- గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా స్పందించారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా కేసీఆర్- క్లౌడ్ బరస్ట్ ఆరోపణలను ప్రస్తావించిన విషయం తెలిసిందే. గోదావరికి సంభవించిన వరదలు క్లౌడ్ బరస్ట్ వల్లే వచ్చాయని, దీని వెనక విదేశాల కుట్ర ఉందనే అనుమానాలను వ్యక్తం చేశారు. అదేరోజు, అదే సమయంలో తమిళిసై సౌందరరాజన్ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఉన్నారు. వరద పరిస్థితులను ప్రత్యక్షంగా తిలకించారు. బాధితులను పరామర్శించారు.

గోదావరికి వచ్చిన వరదలు క్లౌడ్ బరస్ట్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని అన్నారు. నది పరీవాహక ప్రాంతంలో ప్రతి సంవత్సరం భారీ వర్షాలు కురుస్తూనే వస్తోన్నాయని, వాటి ఫలితంగా వరదలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఆ సీజన్‌లో వరదల తీవ్రత అధికంగా ఉందని చెప్పారు. దీనికి క్లౌడ్ బరస్ట్ అని పేరు పెట్టడంలో అర్థం లేదని తేల్చి చెప్పారు. లఢక్, ఉత్తరాఖండ్‌లల్లో క్లౌడ్ బరస్ట్ ప్రతి సంవత్సరం సంభవిస్తుంటాయని అన్నారు.
తమిళిసై-కేసీఆర్ మధ్య కొంతకాలంగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోందంటూ వస్తోన్న వార్తలను మరింత బలపరిచేలా ఆమె ఈ కౌంటర్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో వారిద్దరూ వేర్వేరుగా పర్యటనలను నిర్వహించారు. బాధితులను పరామర్శించారు. ఒకే రోజు, ఒకే అంశం మీద.. గవర్నర్, సీఎం వేర్వేరుగా సమీక్షలను నిర్వహించడంతో విభేదాలు కొనసాగుతున్నాయనే సందేశాన్ని పంపించినట్టయింది.












Click it and Unblock the Notifications