మూడో విడత రుణమాఫీ ఒకేసారి కాదు- తాజా మార్గదర్శకాలు..!!
తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ అమలును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటి వరకు రూ 1.50 లక్షల వరకు రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఆగస్టు 15 లోగా రూ 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. రూ 2 లక్షలకు పైగా ఉన్న రుణాల మాఫీ పైన ప్రభుత్వం కొన్ని సూచనలు చేస్తోంది. రూ.2 లక్షలు, అంతకంటే ఎక్కువగా అప్పులున్న రైతులకు రెండు దఫాలుగా రుణమాఫీ చేయనుంది.
ప్రభుత్వ తాజా నిర్ణయం
రుణమాఫీ మూడో విడత అమలు పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2 లక్షలు, ఆపైన రుణాలున్న రైతులను రెండు విభాగాలుగా విభజించి రుణమాఫీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.లక్ష, లక్షన్నర రుణాలను రెండు విడతల్లో మాఫీ చేసిన సర్కారు.. రూ.2 లక్షలు, అంతకంటే ఎక్కువగా అప్పులున్న రైతులకు రెండు దఫాలుగా రుణమాఫీ చేయనుంది. రూ.2 లక్షల వరకు అప్పున్న రైతులను ఒక విభాగంలో, రూ.2 లక్షల కంటే ఎక్కువగా బకాయిలున్న రైతులను మరో విభాగంలో తీసుకోనుంది. మూడో విడత రుణమాఫీని రెండు దఫాలుగా అమలు చేయనుంది. ఈ మేరకు వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు రైతుల రుణ సమాచారాన్ని సేకరిస్తున్నారు.

మూడో విడత అమల్లో
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. రూ.2 లక్షల కంటే ఎక్కువ బాకీ ఉన్న రైతులకు కూడా రూ.2 లక్షలు మాఫీ చేస్తోంది. ఒక రైతుకు 3 లక్షల పంట రుణం ఉంటే.. అందులో రూ.2 లక్షలు ప్రభుత్వం మాఫీ చేస్తుంది. ఆగస్టులో మూడో విడత మాఫీ పూర్తయిన తర్వాత.. ఇలాంటి రైతులకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ పూర్తవడానికి మరింత సమయం పట్టనుంది. రూ.2 లక్షల కంటే ఎక్కువ అప్పున్న రైతులకు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం ఒక షరతు పెట్టింది. 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న మొత్తాన్ని రైతులు ముందుగా బ్యాంకులకు చెల్లించాలి.
రూ 6వేల కోట్లు అవసరం
ఆ తర్వాత ప్రభుత్వం రూ.2 లక్షలు మాఫీ చేస్తుంది. ఒక రైతుకు రూ. 2.50 లక్షల పంట రుణం ఉంటే.. తొలుత ఆ రైతు రూ.50 వేలు బ్యాంకులో చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం 2 లక్షలను మాఫీ చేసి, రైతు రుణ ఖాతాను జీరో చేస్తుంది. అయితే రెండు లక్షలకు మించి ఉన్న సొమ్మును చెల్లించడానికి రైతులు ఎక్కువ సమయం తీసుకునే అవకాశాలున్నాయి. ఖరీఫ్ సాగు ప్రారంభం కావడం, పెట్టుబడి ఖర్చులు ఉండడంతో 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న మొత్తాన్ని చెల్లించడం రైతులకు ఇబ్బందికరంగా మారనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేసుకోవడానికి, అదేక్రమంలో రైతులకు బకాయిలు ఉండకుండా ఏకకాలంలో పంట రుణ ఖాతాను జీరో చేయడానికే ఈ నిబంధనను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడో విడతలో 2 లక్షల రుణమాఫీకి రూ.6 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.












Click it and Unblock the Notifications