రైతు భరోసా రెండో విడత నిధుల జమ తేదీలో మార్పు, తాజా ముహూర్తం ఇదే..!!
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా రెండో విడత నిధుల విడుదల పైన కీలక అప్డేట్ ఇచ్చింది. ముందుగా నిర్ణయించిన తేదీలో మార్పు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సుదీర్ఘ నిరీక్షణ తరువాత తొలి విడత నిధులు విడుదల చేసిన ప్రభుత్వం .. రెండో విడత కోసం నిధులు సమీకరిస్తోంది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది. అయితే, రెండో విడతలో ఎవరికి నిధులు జమ కానున్నాయనేది స్పష్టత వస్తోంది. అదే విధంగా ఈ నెలలో నే మూడో విడత నిధులను పూర్తిగా జమ చేసేందుకు కసరత్తు జరుగుతోంది.
రైతు భరోసా రెండో విడత కోసం ప్రభుత్వం నిధులు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మొదటి దఫా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినప్పటికీ రెండో విడత కోసం వారు ఎదురుచూస్తున్నారు. యాసంగి పంటలు చేతికొచ్చే సమయం దగ్గర పడుతుండడంతో సాధ్యమైనంత త్వరగా ఈ నెలలోనే పంపిణీ పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉంది. యాసంగి సీజన్ రైతు భరోసా నిధులను మూడు దఫాలుగా జమ చేస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. మొదటి దఫా నిధులను గత నెల 23న రైతుల ఖాతాల్లో జమ చేసింది. మొత్తం 68,89,955 మంది రైతులకు ఒక ఎకరంలోపు వరకు సొమ్మును వేసింది. 57,44,907.19 ఎకరాలకు మొత్తం రూ.3,446.94 కోట్లు జమ చేసింది. రెండో దశ నిధులను ఈ నెల 22లోగా విడుదల చేస్తామని ప్రభుత్వం గతం లోనే ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 20వ తేదీన రెండో విడత నిధులను విడుదలకు సిద్దం అవుతోంది. ఇక.. మూడో దఫా నిధులను ఈ నెలాఖరుకల్లా వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నిధులు సమీకరిస్తోంది.

ఈ నెల 20న రెండో విడత నిధుల జమ కు ఛాన్స్..!
కాగా.. రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్టీ, ఎక్సైజ్ సుంకాలు, అమ్మకం పన్ను, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రతి నెలా ఆదాయం సమకూరు తుంటుంది. రైతు భరోసా కోసం మార్కెట్ నుంచి రుణాలను పెద్ద మొత్తంలో సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 7న ఒకేసారి రూ.3,900 కోట్లు రుణం తీసుకుంది. ఈ నెల 21న మరో రూ.3,000 కోట్లు అప్పు తీసుకోనుంది. ఇలా మొత్తం రూ.6,900 కోట్లు ఖజానాలో ఉంటాయని తెలుస్తోంది. వాటి నుంచి రెండో దఫా రైతు భరోసాకు కొంతమేర నిధులు బదలాయించే అవకాశాలున్నట్లు తెలిసింది. రెండో దఫా కింద ఐదెకరాల వరకు సొమ్ము జమ చేయవచ్చని సమాచారం. ఇందుకు రూ.3,000 నుంచి రూ.4,000 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఈ నెల 20న రెండో విడత... మూడో దఫాను నెలాఖరు లోగా చేస్తామని చెబుతున్నా... వచ్చే నెల తొలి వారంలో జమ చేసే అవకాశాలున్నాయి. కాగా, రైతు భరోసా స్కీమ్‌ను ఒక సీజన్‌లో అమలు చేయడానికి రూ.9 వేల కోట్ల పైగా అవసరం కానుంది.













Click it and Unblock the Notifications