క్యూర్ 2026 చట్ట ముసాయిదా విడుదల.. భూమి విలువ ఆధారిత పన్ను విధానం ప్రతిపాదన
హైదరాబాద్ మహా నగర పాలనలో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ తెలంగాణా సర్కార్ సరికొత్త క్యూర్ 2026 చట్ట ముసాయిదాను విడుదల చేసింది. 1955 నాటి పాత జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కాలానికి అనుగుణంగా భవిష్యత్ అవసరాల కోసం ఈ నూతన బిల్లును రూపకల్పన చేశారు. ఈ నూతన చట్ట ముసాయుదాపై ప్రజలు తమ అభిప్రాయాలని, సూచనలను తెలియజేయవచ్చు.
పాలనను మరింత పటిష్టం చేసేలా విప్లవాత్మక మార్పులు
ఈ నెల 24వ తేదీవరకు జీహెచ్ఎంసీ అధికారిక వెబ్ సైట్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు.ఇక వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నూతన బిల్లులో పాలనను మరింత పటిష్టం చేసేలా విప్లవాత్మక మార్పులను ప్రతిపాదించారు. ఇందులో తొలిసారిగా ట్రాన్స్ జెండర్ లకు చట్టబద్దత కల్పించారు. మున్సిపల్ కార్పోరేషన్ చరిత్రలోనే తొలిసారి ట్రాన్స్ జెండర్ లకు అధికారిక ప్రాతినిధ్యం కల్పించటం కోసం చట్టబద్దత కల్పించారు.

క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ ఏర్పాటు
దీని ప్రకారం నగర సమగ్ర పర్యవేక్షణ, విపత్తుల నిర్మాణం కోసం ముఖ్యమంత్రి నేతృత్వంలో క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ ఏర్పాటు అవుతుంది. దీని పరిధిలోకి విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, హైడ్రా, పర్యావరణ మార్పులు, వారసత్వం పరిరక్షణ మరియు లింగ సమానత్వం అంటే కీలక విభాగాలు వస్తాయి.
భూమి విలువ ఆధారిత పన్ను విధానం
ఇక ఈ ముసాయిదా చట్టంలో ప్రధాన మార్పుగా ఇప్పటివరకు హైదరాబాద్లో అమల్లో ఉన్న ఆస్తిపన్ను విధానానికి స్వస్తి పలికి, దీని స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర మున్సిపాలిటీల తరహాలో భూమి విలువ ఆధారిత పన్ను విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల నగరంలో ఆస్తిపన్ను పెరిగే అవకాశం ఉంది. మరోవైపు వ్యాపారులకు సులభంగా సింగిల్ ట్రేడ్ విధానాన్ని, అలాగే నగరంలో నైట్ ఎకానమీని ప్రోత్సహించటం కోసం ఈ చట్టం దోహదం చేస్తుంది.
స్మార్ట్ గవర్నెన్స్ కేంద్రం, అప్పిలేట్ అథారిటీ
మరోవైపు అత్యవసర స్పందనల కోసం స్మార్ట్ గవర్నెన్స్ కేంద్రం, ఫిర్యాదుల పరిష్కారానికి అప్పిలేట్ అథారిటీ కూడా ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తీసుకువచ్చిన ఈ బిల్లు హైదరాబాద్ నగర పౌర పరిపాలనలో ఒక కీలకమైన అడుగుగా మారుతుందని భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications