ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు శుభవార్త చెప్పిన మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తాజాగా, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధిపొందే వారి కోసం వైద్య సేవల పరిమితిని రూ. 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కూడా మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు.
ఆరోగ్యశ్రీ సేవల కోసం కొత్తగా డిజిటల్ కార్డ్‌లని అందివ్వనున్నట్లు మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీని కోంస ఈ కేవైసీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఆరోగ్య సేవలలో బయోమెట్రిక్ విధానంలో కొంత ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఫేస్ రికగ్నైజేషన్ విధానం తీసుకురావాలని వైద్యశాఖ నిర్ణయం తీసుకుంది.

కాగా, అర్హులైన పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ సేవలు ఎంతో మంది పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరవాత వైద్యంపై మరింత దృష్టి పెట్టిన కేసీఆర్ సర్కార్ ఎప్పటికప్పుడు పేదవాడికి అవసరం అయ్యే నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా లబ్దిపోందే వారి కోసం వైద్య సేవల పరిమితిని 2 లక్షల నుంచి 5లక్షలకు పెంచింది.
సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు... కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందించి, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం. pic.twitter.com/3dUUrSSzPv
— BRS Party (@BRSparty) July 19, 2023
దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ: హరీశ్ రావు
సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ రైతు వేదికలో ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నిర్వహించిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు. కాలం కాకపోయినా.. రెండు పంటలు పండే నీళ్లు మన దగ్గర ఉన్నాయని రైతులకు హరీశ్‌రావు భరోసానిచ్చారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు.
ఒక గంట కరెంట్‌తో ఒక గుంట భూమి కూడా తడవదని రైతులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలివి లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడో దొంగ రాత్రి కరెంట్ ఇచ్చేవారన్నారు. దొంగ రాత్రి కరెంట్ ఇస్తే.. ఆ సమయంలో బావుల వద్దకు వెళ్లి పాము కాట్లకు రైతులు ఎందరో బలయ్యారు. కరెంట్ షాక్‌లతో కూడా రైతులు చనిపోయారని మంత్రి గుర్తు చేశారు. ఒక విద్యుత్ కనెక్షన్ మీద ప్రభుత్వం రూ. 25 వేలు ఖర్చు చేస్తుందన్నారు.
రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఏడాదికి రూ. 12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి చెప్పారు. రైతుబంధు కింద రూ. 14 వేల కోట్లు ఇస్తున్నామని తెలిపారు. గోడౌన్లు ఇంకా మిగతా వాటికి రూ. 6 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. చంద్రబాబు వారసుడే రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. వ్యవసాయం దండగ అని.. ఐటీ కంపెనీలు పెంచండి అని బాబు అన్నారు. కరెంట్ బిల్లులు తగ్గించమన్న రైతులను బషీర్‌బాగ్‌లో కాల్చి చంపించాడని గుర్తు చేశారు. కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని రైతులను కోరారు మంత్రి హరీశ్‌రావు.












Click it and Unblock the Notifications