తెలంగాణా సంక్షేమ పథకాల అమలులో ఏఐ.. రేవంత్ సంచలన నిర్ణయం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు అన్ని రంగాలలోనూ తనదైన ప్రభావాన్ని చూపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు కోసం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించాలని కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేయడం కోసం, నిజమైన లబ్ధిదారులకు అందించడం కోసం ఈ సాంకేతికతను వినియోగించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.
సంక్షేమ పథకాల అమలులో ఏఐ
16వ ఆర్థిక సంఘం నివేదికలు అలాగే రాష్ట్ర ప్రభుత్వ సామాజిక తనిఖీలలో అనర్హులకు పెద్ద ఎత్తున పథకాలు అందుతున్నట్లు స్పష్టంగా వెల్లడైన నేపథ్యంలో సంక్షేమ పథకాలను అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తే ఫలితం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల కాలంలో ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ వివరాలను దాచిపెట్టి సంక్షేమ పథకాలను పొందుతున్నట్టు బయటపడడంతో ఈ వ్యవహారం అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తుంది.

ఏఐతో లబ్దిదారుల తనిఖీ
ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసి నిజమైన అర్హులకు మాత్రమే పథకాలను అందజేయాలని భావిస్తున్న తెలంగాణ సర్కార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లబ్ధిదారుల జాబితాలను నిరంతరం అప్డేట్ చేయడం, నకిలీ ఎంట్రీలను తొలగించడం ఇతర ప్రభుత్వ విభాగాల డేటాతో అనుసంధానం చేసి లబ్ధిదారుడా కాదా అన్న వివరాలను గుర్తించడం చేయనుంది.
ఢిల్లీ సదస్సు తర్వాత ఏఐ వినియోగంపై ప్రభుత్వం నిర్ణయం
ఈ సరికొత్త విధానం పైన సాంకేతిక సహకారం, విధివిధానాల రూపకల్పన కోసం వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఇప్పటికే రాష్ట్ర ఐటీ శాఖతో ప్రాథమిక సంప్రదింపులు జరిపారు. ఢిల్లీలో జరిగిన ఈ సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పథకాల అమలు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధికారికంగా వినియోగించాలని నిర్ణయించారు.
లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేసేలా ఏఐ
ఏఐ ఆల్గారిధమ్ లతో రెవిన్యూ, మున్సిపల్, వైద్య, పంచాయతీరాజ్, సివిల్ సప్లై సహా అన్ని శాఖల డేటాబేస్ అన్నింటిని ఒకే ప్లాట్ఫారం పైకి తీసుకుని వచ్చి అనుసంధానం చేయనున్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల జోక్యం లేకుండా పూర్తిగా అర్హత ఆధారంగానే లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా ఏఐ తో చెయ్యొచ్చని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications