తెలంగాణలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లు: ఏ జిల్లాలో ఏ జోన్లో అంటే..?
హైదరాబాద్: తెలంగాణలో కొత్త జోనల్ విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఖరారు చేశారు. తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా, గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.
రాష్ట్ర ఆవిర్భావంతో పాటు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో జోనల్ వ్యవస్థను పూర్తిస్థాయిలో పునర్విభజించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రంలో మొత్తం 7 జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

కొత్త జోనల్ వ్యవస్థ
తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విదంగా.. గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా ఈ జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నందున ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. గతంలోనే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేసింది. ఐఏఎస్ అధికారుల కమిటీ కూడా కసరత్తు చేసింది.

జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలను ఖరారు
ఇటీవల జరిగిన ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమావేశంలోనూ జోనల్ విధానం అంశం చర్చకు వచ్చింది. ఇందుకు సంబంధించి టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ నేతృత్వంలో సంప్రదింపుల కమిటీని కేసీఆర్ ఏర్పాటుచేశారు. ఆ కమిటీ ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయాలను తీసుకొంది. వాటన్నింటి ఆధారంగా ఈ రోజు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి తెలంగాణలో జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలను ఖరారు చేశారు.

ఆమోదం తర్వాత కేంద్రానికి
అందరి ప్రతిపాదనలు, మంత్రి వర్గ ఉపసంఘం నివేదికల ఆధారంగా రాష్ట్రాన్ని ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లుగా విభజించి జోనల్ వ్యవస్థను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దీనిపై చర్చించేందుకు శుక్రవారం టీజీవో భవన్‌లో సమావేశం జరగనుంది. ఉద్యోగుల సమావేశం తర్వాత వారి అభిప్రాయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి నోట్ పంపనున్నారు. జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థకు కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే కేంద్రానికి పంపనున్నారు. కాగా, రాష్ట్రపతి ఆమోదంతో జోన్ వ్యవస్థ అమల్లోకి రానుంది.
కేసీఆర్ స్వయంగా..
ఈ మొత్తం వ్యవహారాన్ని తానే స్వయంగా పర్యవేక్షించి తెలంగాణలో కొత్త జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థ అమలులోకి వచ్చేలా చూస్తానని సీఎం కేసీఆర్ చెప్పారు. దీనికి అనుగుణంగా రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాలను ఏడు జోన్‌లుగా, జోన్లను రెండు మల్టీ జోన్‌లుగా విభజించారు.
ఏడు జోన్లు, 2మల్టీజోన్లివే..
-కాళేశ్వరం జోన్ (28.29 లక్షల జనాభా): భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి
- బాసర జోన్ (39.74 లక్షల జనాభా): ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల
- రాజన్న జోన్ (43.09 లక్షల జనాభా): కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్
-భద్రాద్రి జోన్ (50.44 లక్షల జనాభా): కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్
- యాదాద్రి జోన్ (45.23 లక్షల జనాభా): సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, జనగామ
-చార్మినార్ జోన్ (1.03 కోట్ల జనాభా): హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి
-జోగులాంబ జోన్ (44.63 లక్షల జనాభా): మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, వికారాబాద్
మల్టీజోన్లు..
-మల్టీజోన్ 1 (1.61 కోట్ల జనాభా): కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి
- మల్టీజోన్ 2 (1.88 కోట్ల జనాభా): యాదాద్రి, చార్మినార్, జోగులాంబ












Click it and Unblock the Notifications