తెలంగాణ హైకోర్టు జడ్జి గిరిజా ప్రియదర్శిని మృతి..
తెలంగాణ హైకోర్టు జడ్జి గిరిజా ప్రియదర్శిని మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం నాడు తుదిశ్వాస విడిచినట్టు వారి కుటుంబ సభ్యులు వాపోయారు.
ఈరోజు ( సోమవారం, మే 5 ) మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆమె మృతిపట్ల న్యాయమూర్తులు, న్యాయవాదులు, పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. జిల్లా కోర్టు న్యాయమూర్తి నుంచి ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా ఎదిగి న్యాయసేవల రంగంలో ఆమె చేసిన కృషిని గొప్పదని తెలంగాణ న్యాయమూర్తుల సంఘం కొనియాడింది.

జస్టిస్ గిరిజా ప్రియదర్శిని ఏపీలోని విశాఖపట్టణానికి చెందిన వ్యక్తి. ఆమె ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్‌సైన్స్‌లో పీజీ పూర్తి చేశారు. 1995లో విశాఖపట్నంలోని ఎన్.బి.ఎం లా కాలేజీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 1997లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లాలో ఎల్.ఎల్.ఎం. పూర్తిచేశారు.
1995లో లాయర్‌గా ఎన్‌రోల్ అయిన ఆమె విశాఖ జిల్లా కోర్టులో ఏడు సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత 2008లో తొలిసారిగా అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. 2016 ఆగస్టు నుంచి 2018 డిసెంబరు వరకు ఒంగోలు ప్రిన్సిపల్ జడ్జిగా, 2019 జనవరి నుంచి 2020 అక్టోబరు వరకు ఆదిలాబాద్ ప్రిన్సిపల్ జిల్లాజడ్జిగా, తర్వాత 2022 మార్చి వరకు కరీంనగర్ ప్రిన్సిపల్ జిల్లాజడ్జిగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించే కంటే ముందు.. గిరిజా ప్రియదర్శిని.. రాష్ట్ర లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీగానూ పనిచేశారు. 2022 మార్చిలో ఆమె తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టారు.












Click it and Unblock the Notifications