పదే పదే ఆదేశాలిస్తున్నా.. పరిస్థితిలో మార్పేది: తెలంగాణ సర్కారు కరోనా నివేదికపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికపై ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదిక సంపూర్ణంగా లేదని వ్యాఖ్యానించింది. కరోనా కేసులు, మరణాల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా ఆస్పత్రులు లేనందునే ప్రజలు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది.

పదే పదే ఆదేశిస్తున్నా..
చనిపోయినవారిని తరలించే అంబులెన్స్ ఆపరేటర్ల అక్రమాలను ఎందుకు అడ్డుకోవడం లేదని సర్కారును హైకోర్టు ప్రశ్నించింది. అంబులెన్స్ లను నిత్యం అందుబాటులో ఉంచాలని, మరిన్ని టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేయాలని సూచించింది. పదే పదే ఆదేశిస్తున్నా.. ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రోజూ జిల్లాల వారీగా బులెటిన్ ఇవ్వాలని, హోం ఐసోలేషన్లో ఉన్నవారి కోసం హితం యాప్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప్రభుత్వం అలసత్వం వల్లే కేసుల పెరుగుదల
ప్రభుత్వం అలసత్వం వల్లే కరోనా కేసులు 10వేలు దాటాయని మండిపడింది. ఓ వైపు కేసులు పెరుగుతుండగా.. మూతబడిన స్కూళ్లు, కాలేజీలను కరోనా క్వారంటైన్ కేంద్రాలుగా ఎందుకు మార్చుకోవడం లేదని ప్రశ్నించింది. మద్యం దుకాణాల వద్ద కరోనా నిబంధనలు ఎవరూ పాటించడం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఎన్నికల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..
మున్సిపల్ ఎన్నికలతో కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నికలకు సంబంధించి పోలింగ్ బూత్‌ల వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల సమయంలో కట్టడిపై తీసుకుంటున్న చర్యలపై ఏప్రిల్ 29లోగా పూర్తి నివేదిక సమర్పించాలని ఎస్ఈసీని ఆదేశించింది.

హైకోర్టుకు సమర్పించిన నివేదికలో తెలంగాణ సర్కారు ఇలా
కాగా, అంతకుముందు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ సర్కారు నివేదిక సమర్పించింది. ఏప్రిల్ 1 నుంచి 25 వరకు రాష్ట్రంలో 23.55 లక్షల కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది. వీటిలో 4.39 లక్షల ఆర్టీపీసీఆర్, 19.16 లక్షల ర్యాపిడ్ పరీక్షలు ఉన్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి 25 వరకు 341 మంది కరోనా బారినపడి మరణించినట్లు తెలిపింది. కరోనా పాజిటివిటీ రేటు 3.5 శాతంగా ఉందని పేర్కొంది.
కరోనా పరీక్షలు ఇంకా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని సర్కారు తన నివేదికలో తెలిపింది. నిపుణుల కమిటీ సమావేశాలు ఆన్ లైన్‌లో జరుగుతున్నాయని పేర్కొంది. బార్లు, పబ్ లు కరోనా నిబంధనలు పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. మద్యం దుకాణాలను అబ్కారీ అధికారులు తనిఖీలు చేస్తున్నారని పేర్కొంది. రాష్ట్రానికి 430 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేంద్రం కేటాయించింది. వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్ తీసుకుంటున్నట్లు తెలిపింది. రెమిడిసివిర్ సరఫరా పర్యవేక్షణకు ప్రీతిమీనాను నోడల్ అధికారిగా నియమించినట్లు ప్రభుత్వం తన నివేదికలు పేర్కొంది.












Click it and Unblock the Notifications