Weather Update: తెలంగాణలో వచ్చే రెండు రోజులు వర్షాలు..!
వచ్చే రెండు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అక్టోబరు 6, 7 తేదీల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వివరించింది. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే హైదరాబాద్ లో కూడా వచ్చే రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. హైదరాబాద్‌లో అక్టోబర్ 9 వరకు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ బంగాళాఖాతం మీదుగా ఎగువ వాయు తుఫాన్ విస్తరించి ఉందని వివరించింది. ప్రస్తుతం ఏపీ తీరంలో 1.5 కి.మీ. నుంచి 4.54.5 కి.మీ మధ్య సముద్ర మట్టానికి ఎత్తులో నైరుతి వైపు కదులుతుందని తెలిపింది. దీని ప్రభావంతోనే వానలు అవకాశం ఉందని అంచనా వేసింది. హైదరాబాద్, మల్కాజ్ గిరి, నిజామాబాద్, సిరిసిల్లా, కామారెడ్డి, భువనగిరి, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబ్ద, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఆదివారం మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో ఈ నైరుతు రుతుపవనాల సీజన్ లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అయింది. రాష్ట్రంలో సగటున 962.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 30 శాతం ఎక్కువ. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 738.6 మి.మీ గా ఉంది.
హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం 615.4 మిల్లీమీటర్లు కాగా ఈ సీజన్ లో 825.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఖైరతాబాద్ ప్రాంతంలో సాధారణ వర్షపాతం 636.7 మిమీతో పోలిస్తే 947.7 మిమీ నమోదై 49 శాతం వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో నారాయణపేట జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు అయింది. ప్రస్తుతం రుతుపవనాలు తిరోగమిస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. అటు ఏపీలో కూడా తేలిపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications