మందుబాబుల్లో దేశంలోనే తెలంగాణా టాప్.. ఏపీ ఏ స్థానంలో ఉందంటే!
మందు బాబులం మేము మందు బాబులం.. మందు కొడితే మాకు మేమే మహారాజులం అని తాగి ఊగడంలో తెలంగాణ నే మొదటి స్థానంలో ఉందని తాజాగా ఓ సర్వే తేల్చింది. దేశంలోనే మద్యం విక్రయాలలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.
మద్యం విక్రయించే రాష్ట్రాలపై సర్వే
తెలంగాణ రాష్ట్రంలో గతేడాది సగటున మద్యం కోసం ఒక్కొక్కరు 1623 రూపాయలు ఖర్చు చేసినట్టు తాజా సర్వేలో వెల్లడయింది.
అత్యధికంగా మద్యం విక్రయించే రాష్ట్రాల పైన సర్వే నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ సంస్థ దేశంలోనే అందరికంటే ఎక్కువ తెలంగాణ ప్రజలు మద్యం కోసం ఖర్చు పెడుతున్నారని పేర్కొంది.

మద్యం కోసం తక్కువ ఖర్చు పెట్టే రాష్ట్రాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం కోసం ఒక్కో వ్యక్తి గతేడాది సగటున 1306 రూపాయలు ఖర్చు చేసినట్టు పేర్కొంది. పంజాబ్ రాష్ట్రంలో 1245 రూపాయలు, ఛత్తీస్గడ్ రాష్ట్రంలో 1227 రూపాయలు ఒక్కో వ్యక్తి లిక్కర్ కోసం ఖర్చు చేసినట్టు సర్వే పేర్కొంది. ఇక ఈ సర్వేలో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, త్రిపుర రాష్ట్రాలు మద్యం పైన తక్కువ ఖర్చు చేస్తున్నట్టు తేలింది.
పశ్చిమ బెంగాల్ లో ఒక వ్యక్తి మద్యంపైన కేవలం 4రూపాయలు మాత్రమే
మద్యం కోసం అతి తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది. 2022 - 23 సంవత్సరంలో కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అతి తక్కువ ఖర్చు మద్యం కోసం చేసినట్టు సర్వే రిపోర్ట్ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక వ్యక్తి మద్యం పైన కేవలం నాలుగు రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తున్నట్టు సర్వే పేర్కొంది.
తెలంగాణా టాప్ లో.. ఏపీ స్థానమిదే
దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క వ్యక్తి సగటున మద్యం పైన సంవత్సరానికి 49రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పండుగ అయినా, పబ్బమైనా కార్యక్రమం ఏదైనా సరే మందు ఏరులై పారాల్సిందే. ఇక మద్యం కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు మందేసి చిందేసే పనిలో పోటీ పడుతున్నారు అన్నది ఈ సర్వే ద్వారా వెల్లడైంది.












Click it and Unblock the Notifications