కొత్త కొలువులపై కేటీఆర్: హైదరాబాద్ ఐటీని మార్చే నాలుగు పాలసీలివే
హైదరాబాద్: ఆటోమేషన్, రోబోటిక్స్‌ల కారణంగా ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని ఆందోళన చెందుతున్న వేళ, ఆ భయాన్ని దూరం చేస్తూ... కొత్త ఉద్యోగాలకు బాటలు వేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాన్ని సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం గురువారం నాలుగు పాలసీలను విడుదల చేసింది.
ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశీయంగా ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించేందుకు, అందివస్తున్న అవకాశాలను కైవసం చేసుకునేందుకు ఐటీ ఉప పాలసీలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాటలను ఆయన ఉటంకించారు.
భవిష్యత్‌లో మనం ఎదుర్కొనేది రక్తపాతం లేని యుద్ధం. ఈ సైబర్ వార్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున నష్టం జరుగుతున్నది అని 2015లో డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. అదే సమయంలో మరోమాట కూడా చెప్పారు.
ఆ విపత్తు ఆధారంగా మనం భయపడనక్కరలేదు. మనం ఈ రంగంలోని ప్రమాదాలను అరికట్టే శక్తిగా నిలువాలి. ఆ దిశగా మనం ముందడుగు వేయాలి అని సూచించారు. ఈ రకంగా ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు, వాటిలో నుంచి అవకాశాలు ఒడిసిపట్టుకునేందుకు కొత్త పాలసీలు తీసుకువస్తున్నాం అని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఉప పాలసీలు విడుదల చేసిన మంత్రి కేటీఆర్
ఉప పాలసీలు విడుదల చేసే విషయంలో కొందరిలో ఉన్న అభిప్రాయాలు తనకు తెలుసునని మంత్రి కేటీఆర్ అన్నారు. చాలామందిలో ఇన్ని ఐటీ పాలసీలు ఎందుకు అనే సందేహం కలుగుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం శరవేగంగా మారుతుందని చెప్పిన ఆయన దీనికి అనుగుణంగా ముందుకుసాగుతున్న దేశాలు అభివృద్ధిలో స్పష్టమైన మార్పును చూపిస్తున్నాయన్నారు.

ఆటోమేషన్ (యాంత్రీకరణ) వల్ల ఉద్యోగాలు
ఆటోమేషన్ (యాంత్రీకరణ) వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే భావన
వివిధ రకాల రంగాల్లో పెద్ద ఎత్తున కొలువులు వస్తున్నాయి. అంతేకాకుండా ఆటోమేషన్ (యాంత్రీకరణ) వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే భావన వ్యక్తమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఐటీ సంస్థల చూపు హైదరాబాద్ వైపు ఉన్న తరుణంలో మనం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు.

మరిన్ని కంపెనీలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది
అదేవిధంగా ఇప్పటివరకు వచ్చిన అత్యున్నత సంస్థలతోపాటు మరిన్ని కంపెనీలను హైదరాబాద్‌లో, తెలంగాణవ్యాప్తంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఈ రంగంలో హైదరాబాద్ ఆదర్శంగా నిలువాల్సి ఉంది. అందుకే ఈ ఉప పాలసీలు రూపొందించామన్నారు. 250కి పైగా దిగ్గజ ఐటీ కంపెనీల అధినేతలు, వివిధ టెక్నాలజీ సంస్థలతో అధ్యయనం చేసిన తర్వాతనే వీటికి ఒక రూపం తెచ్చామన్నారు.

స్టార్టప్ స్టేట్‌గా ఇప్పటికే తెలంగాణకు గుర్తింపు
క్లౌడ్ కంప్యూటింగ్, గేమింగ్, ఇమేజ్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, బిగ్ డాటా వంటివాటిపై మా ప్రయత్నం కొనసాగుతుందన్నారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, సోలార్ ఉపకరణాలు వంటివి మా తర్వాతి లక్ష్యాలన్నారు. స్టార్టప్ స్టేట్‌గా ఇప్పటికే గుర్తింపు ఉన్న తెలంగాణను కొత్త సేవలు, ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముందుకు సాగుతున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్రం చాలా తెలివిగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది
ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాన్ని విస్తృత అధ్యయనం చేసి అవకాశాలు ఒడిసి పట్టుకునేందుకు సన్నద్ధం అవుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం చాలా తెలివిగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నదని, ముందుగానే సన్నద్ధమై అవకాశాలను అందిపుచ్చుకుంటున్నదని దినేశ్ మల్కానీ కొనియాడారు. ముందుచూపు, వినూత్నంగా ఆలోచించే జ్ఞానం, చురుకుగా ముందుకువెళ్లే సత్తా గల నాయకత్వం తెలంగాణలో ఉందని ప్రశంసించారు.

విప్లవాత్మకమైన ఐటీ ఆవిష్కరణలతో మార్పులు
సాంకేతిక రంగంతో పెనుమార్పులు తీసుకురావచ్చునని గ్రహించి సమయాని కంటే ముందే అవకాశాలను ఒడిసిపట్టుకునేలా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని అభినందించారు. విప్లవాత్మకమైన ఐటీ ఆవిష్కరణల ద్వారా అభివృద్ధి రూపుమారుతుందని భావించి నాలుగు ఐటీ అనుబంధ పాలసీలు ప్రవేశపెట్టడం విశిష్ట ముందడుగు అని అన్నారు.

హైటెక్ సిటీ అద్భుతంగా ఉంది
హైటెక్ సిటీ అద్భుతంగా ఉందని, తెలంగాణ వంటి మెరుగైన సదుపాయాలు గల రాష్ట్రం ద్వారా అభివృద్ధి దూసుకుపోవచ్చునని తెలిపారు. ఫుడ్, వాటర్, వైఫై అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి ఉందని చమత్కరించారు. మంత్రి కేటీఆర్ విజన్‌కు ఈ సందర్భంగా మల్కానీ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ ఐటీ తెరపై తెలంగాణ ప్రత్యేక ముద్రను మరింతగా మెరుగుపరుచుకుంటుందని అన్నారు.

ముఖ్య అతిథిగా సిస్కో ఇండియా ప్రెసిడెంట్ దినేశ్ మల్కానీ
హెచ్‌ఐసీసీలో నిర్వహించిన నాలుగు అనుబంధ పాలసీల ఆవిష్కరణ కార్యక్రమానికి సిస్కో ఇండియా ప్రెసిడెంట్ దినేశ్ మల్కానీ ముఖ్య అతిథిగా హాజరుకాగా ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇంటెల్ సెక్యురిటీ దక్షిణాసియా ఎండీ ఆనంద్ రామ్మూర్తి, డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీఈవో రమావేదశ్రీ, నల్సార్ వీసీ ఫైజాన్ ముస్తఫా, జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, హైసియా అధ్యక్షుడు రంగా పోతుల, నాస్కాం ఉపాధ్యక్షుడు కేఎస్ విశ్వనాథన్, కంట్రోల్ ఎస్ సంస్థ సీఎండీ పీ శ్రీధర్‌రెడ్డి, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి భరణికుమార్‌అరోల్, పలువురు ఐటీ ప్రముఖులు పాల్గొన్నారు.

డాటా అనలిటిక్స్ పాలసీని విడుదల చేసిన మంత్రి కేటీఆర్
డాటా అనలిటిక్స్ పాలసీని మంత్రి కేటీఆర్, సిస్కో ఇండియా ప్రెసిడెంట్ దినేశ్ మల్కానీ, డాటా సెంటర్స్ పాలసీని మంత్రి కేటీఆర్, కంట్రోల్ ఎస్ సంస్థ సీఎండీ పీ శ్రీధర్‌రెడ్డి విడుదల చేశారు. ఓపెన్ డాటా పాలసీని జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, నల్సార్ వీసీ ఫైజాన్ ముస్తఫా ఆవిష్కరించారు. సైబర్ సెక్యూరిటీ పాలసీని డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీఈవో రమావేదశ్రీ, ఇంటెల్ సెక్యూరిటీ ఎండీ ఆనంద్ రామ్మూర్తి విడుదల చేశారు.












Click it and Unblock the Notifications