ఆయన వల్లే తెలంగాణ: కవిత, అందుకే మంత్రినయ్యా: కెటిఆర్
తెలంగాణ ఏర్పాటుకు తెలంగాణ నేతలు అంబేడ్కర్‌ను ప్రశంసించారు. అంబేడ్కర్ వల్లనే తాను మంత్రినయ్యానని కెటిఆర్ అన్నారు.
హైదరాబాద్: డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్‌కు తెలంగాణ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ మంత్రులు కెటి రామారావు, ఈటెల రాజేందర్, పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అంబేడ్కర్‌ను ప్రశంసించారు. అంబేడ్కర్ వల్లనే తెలంగాణ వచ్చిందని కెటిఆర్, కవిత అన్నారు.
అంబేడ్కర్ రాజ్యాంగంలో కల్పించిన వెసులుబాటు కారణంగానే తెలంగాణ ఏర్పడిందని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. తెలుగుదేశం, బిజెపి తెలంగాణ నాయకులు కూడా శుక్రవారంనాడు అంబేడ్కర్‌కు నివాళులు అర్పించారు.
అంబేడ్కర్ కారణంగానే తాను ఈ రోజు మంత్రిని అయ్యానని తెలంగాణ ఐటి మంత్రి కెటి రామారావు అన్నారు. అంబేడ్కర్ వల్లనే తెలంగాణ ఏర్పడిందని కవిత అన్నారు.

అంబేడ్కర్ వల్లనే తెలంగాణ....
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. దళితుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతామని ఆమె చెప్పారు.

అంబేడ్కర్ వల్లనే నేను మంత్రినయ్యా...
అంబేద్కర్ వల్లే తెలంగాణ ఏర్పడిందని, తెలంగాణ ఏర్పడినందువల్లే తాను మంత్రిని కాగలిగానని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం హైదరాబాదులో గల మాదాపూర్‌లోని ఎన్ఏసిలో డిఐసిసిఐ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్స్ డెవలప్ మెంట్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్రభుత్వ టెండర్స్ లోని అన్ని శాఖల్లోనూ 50 శాతం ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి చేయూతనిస్తుందని, రాజ్యాంగం శరణం గచ్చామి అనేది అందరూ పాటించాలని మంత్రి అన్నారు.

మాది అంబేడ్కర్ ఎజెండానే...
అంబేద్కర్ ఏజెండానే తమ ఏజెండా అని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం అంబేద్కర్ ఆలోచన విధానాలను అమలు చేస్తోందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అభివృద్ది పరంగా దేశంలోనే తెలంగాణ ఆదర్శ రాష్ట్రమని ఆయన అన్నారు.

స్ఫూర్తి ప్రదాత అంబేడ్కర్
చిన్న రాష్ట్రాల స్ఫూర్తి ప్రదాత అంబేడ్కర్ అని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ జేఏసీ కార్యాలయంలో శుక్రవారం అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమం ఉధృతం అయినతర్వాత అంబేద్కర్ ప్రతి ఇంటికీ పరిచయమయ్యారని ఆయన చెప్పారు. అంబేద్కర్ బలమైన ప్రజాస్వామికవాదని, సమాజంలో అసమానతలు ఉండకూడదని కోరుకున్నారని అన్నారు. స్వాతంత్రం వచ్చింది కానీ రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానతలు మాత్రం రాలేదని ఆయన అన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తితో తెచ్చుకున్న తెలంగాణను సామాజిక తెలంగాణగా మారాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. (

ట్యాంక్‌బండ్ వద్ద అంబేడ్కర్‌కు నివాళి
అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతోపాటు బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. భారతదేశ మొదటి కార్మిక శాఖ మంత్రి అంబేద్కర్ అని, దళితులను ప్రధాని మోడీ ఓటు బ్యాంకుగా చూడకుండా వారి అభివృద్ధి కోసం చేస్తున్న పనులు ఒక విశ్వాసాన్ని కల్పిస్తున్నాయని బండారు దత్తాత్రేయ అన్నారు.

అంబేడ్కర్ అలా వద్దన్నారు...
రాజ్యాంగంలో అంబేడ్కర్ మత పరమైన రిజర్వేషన్ వద్దని పేర్కొన్నా తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ మతపరమైన రిజర్వేషన్ తీసుకురావాలని చూస్తున్నారని, దానిని మేము వ్యతిరేకిస్తున్నామని బిజెపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు.పేదరిక నిర్మూలన కోసం కేంద్రం వినూత్న పథకాలు ప్రవేశపెడుతోందని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. దళితులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు స్టాండప్ ఇండియా పథకాన్ని అమలు చేస్తున్నారని ఆయన అన్నారు.

కెసిఆర్ సొంత రాజ్యాంగం అమలు...
హైదరాబాదులో టిడిపి కార్యాలయంలో శుక్రవారం అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటు తదితర టిడిపి నేతలు అంబేద్కర్ కు నివాళులర్పించారు. దేశం అంతటా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే మన రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ సొంత రాజ్యాంగం అమలవుతోందని రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు.

కెసిఆర్ పాలనలో ఇలా...
పరాయి పాలన నుంచి విముక్తి పొందిన ఈ దేశంలో అందరూ సమానులేనని, అన్ని రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు రావాలని అంబేద్కర్ కోరుకున్నారని ఎల్ రమణ అన్నారు. తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ లో ఉన్నా కూడా కేసీఆర్ పాలనలో పేదలకు న్యాయం జరగలేదన్నారు. సంపన్నులకు, పెత్తందార్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ కొమ్ముకాస్తున్నారని రమణ విమర్శించారు. తెలంగాణలో దొరస్వామ్యానికి చరమగీతం పాడాలని అన్నారు. కేసీఆర్ కేబినెట్ లో ఆడబిడ్డలకు స్థానం కల్పించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications