తెలంగాణ శాసనసభ రద్దు? త్వరలోనే సమావేశమవనున్న సభ?
తెలంగాణ శాసనసభను రద్దుచేస్తారన్నా ఊహాగానాలు జోరందుకున్నాయి. త్వరలోనే శాసనసభ సమావేశాలు నిర్వహించి తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష, రుణాలు తీసుకోవడంలో కేంద్రం నుంచి ఎదురవుతున్న సహాయ నిరాకరణ, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం తదితర అంశాలపై సభలో చర్చ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడనేది త్వరలోనే తేదీలు ఖరారు చేస్తారని తెలంగాణ రాష్ట్రసమితి వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది చివరిలోనే తెలంగాణ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత
షెడ్యూల్ ప్రకారం 2023 డిసెంబరులో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగాలి. అయితే ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని ప్రశాంత్ కిషోర్ టీమ్ సర్వే నిర్వహించి నివేదిక అందజేసింది. ఈసారి సిట్టింగ్‌ల్లో ఎక్కువమందికి టికెట్లు దక్కవని, వారికి ప్రత్యామ్నాయ పదవులిస్తానని కేసీఆర్ నేరుగా వారికి హామీ ఇవ్వబోతున్నట్లు టీఆర్ ఎస్ వర్గాల సమాచారం.

ఎన్నికలకు సిద్ధమవ్వాలంటూ కేటీఆర్ పిలుపు
ఐటీ మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనలో ఎన్నికలకు సిద్ధమవ్వాలంటూ నేతలకు పిలుపునివ్వడం ఈ ఊహాగానాలను మరింత బలపరుస్తోంది. కేసీఆర్ రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం ఈనెల 18 లేదా 19 తేదీల్లో జాతీయ పార్టీని ప్రకటిస్తారు. రాబోయే ఎన్నికల్లో గెలుపొందడానికి అభ్యర్థుల మార్పుతోపాటు ప్రచార వ్యూహాన్ని కూడా ఖరారు చేయనున్నారు. శాసనసభను వీలైనంత తొందరగా రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.

50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు హుష్ కాకి?
త్వరలో నిర్వహించబోయే శాసనసభ ప్రత్యేక సమావేశాలే చివరి సమావేశాలనే వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎటువంటి వ్యతిరేకత లేనప్పటికీ దాదాపు 50 మంది ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందని తేలింది. ముందుగా రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవాలన్న పట్టుదలతో ఉన్న కేసీఆర్ నిర్మొహమాటంగా ఈ 50 మందిని పక్కన పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీకోసం త్యాగం చేయాల్సిందేనని వారికి స్పష్టం చేయబోతున్నారు. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న తర్వాత జాతీయస్థాయిలో బీజేపీపై పోరాడటం సులువవుతుందని
కేసీఆర్ భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications